Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి
- మాజీ ఎంపీ మీడియం బాబురావు డిమాండ్
నవతెలంగాణ-పాల్వంచ
అంగన్వాడీ టీచర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడి చేస్తున్నాయని తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నాయని శ్రమకు తగిన కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల రెండవ రోజు ధర్నా శిబిరంలో డాక్టర్ మీడియా బాబురావు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పోరాటాల ద్వారానే కొన్ని హక్కులు సాధించుకున్నారని ఇప్పటివరకు సాధించుకున్న హక్కులను రక్షించుకోవడంతో పాటు మరిన్ని హక్కులు సాధించుకోవాలని సూచించారు. టీచర్లు, హెల్పర్లకు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు దళితులు బలహీన వర్గాల హక్కుల కోసం సంక్షేమం కోసం అంగన్వాడీ టీచర్లు సీఐటీయూ నాయకత్వంలో చేస్తున్న పోరాటాలను తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం సంపూర్ణంగా బలపరుస్తుందని సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు.
గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయాలి :సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయాలి. చట్టబద్ధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరం కాకుండా కాపాడాలి. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
అన్నవరపు కనకయ్య
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు తల్లులు పిల్లలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలోనూ సీపీఐ(ఎం) అగ్రభాగంలో ఉంటుంది. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతాం. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రకటించాలి.
పోరాటానికి ప్రజాసంఘాలు అండగా ఉండాయి :కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు
న్యాయమైన డిమాండ్లు, ఐసీడీఎస్ పరిరక్షణ, హక్కుల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు చేస్తున్న పోరాటానికి ప్రజాసంఘాలు అండగా ఉంటాయి. కార్మికులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో చీలకొడుతుంది. ఐక్య పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి. సమాజంలో ఎక్కువ శ్రమ చేసి సామాజిక ప్రగతికి బాటలు వేస్తున్నది శ్రామిక మహిళలని తెలిపారు.
నాణ్యమైన పోషకాహారాన్ని అందించడం ద్వారా పేదలకు మరింత సేవలను అందించాలి. అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటామని రైతులు కార్మికులు కలిసి పోరాటాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ప్రతికడించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ కోరారు. కార్మిక హక్కుల కోసం రైతుల పంటల గిట్టుబాటు ధరల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఏప్రిల్ 5వ తేదీన జరుగుతున్న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానం రద్దు కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం అంగన్వాడీ టీచర్లు సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలని యూటీిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానం ద్వారా ప్రజలకు విద్య దూరమవుతుందని పేర్కొన్నారు. విద్య హక్కు చట్టాన్ని రక్షించుకోవాలన్నారు. రెండో రోజు ధర్నాకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి సుల్తానా, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల యూనియన్ కార్యదర్శి నరసింహారావు తదితరులు సంఘీభావాన్ని మద్దతును ప్రకటించారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రజా సంఘాల నాయకులు ముసలయ్య, నందిపాటి రమేష్, హుస్సేన్, ఎస్వితో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే.బ్రహ్మచారి, ఏజే.రమేష్, అంగన్వాడి యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటమ్మ, జి.పద్మ, సిఐటియు జిల్లా ఆఫీస్ బ్యానర్లు, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఆఫీస్ బ్యానర్లు, జిల్లాలోని 11 ప్రాజెక్టులకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, 2000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు పాల్గొన్నారు. సమ్మె విజయవంతమైందని అధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని సీఐటీయూ హెచ్చరించింది.