Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ ఇండ్లను సైతం వదిలి పెట్టని అధికార పార్టీ నేతలు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
- అన్యాయాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కలగానే మిగిలిపోయాయని, అధికార పార్టీ నాయకులు ఈ పథకాన్ని సైతం వదిలి పెట్టడం లేదని బహుజన్ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శుక్రవారం బాధితులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, మాట్లాడారు. గూడు లేని అభాగ్యులు ఈ సారి తమకు ఇంటి ఆసరా దొరుకుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారని, కానీ కొందరు ప్రజాప్రతినిధుల అవినీతి కారణంగా వారి ఆశలు అడియాసలుగా మారాయని పేర్కొన్నారు. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమకు నచ్చిన వారికి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, వాళ్ళ బంధువులకు, వారి సామాజిక వర్గం వారికి, డబ్బు ముట్టజెప్పిన వారికి కేటాయించేలా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని విమర్శించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంధ్య, గోపిశెట్టి ఆశాకుమారి, ఏడెల్లి మర్థమ్మ, వందన, పద్మ, సయ్యద్ జైతునిషా, సంధ్య, హారిక తదితరులు పాల్గొన్నారు.