Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలామృతం అందుతున్నట్లేనా...?
నవతెలంగాణ-వైరా
వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు, ఏనుకూరు మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మరియు హెల్పర్ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయని కారణంగా చిన్న పిల్లలకి పౌష్ఠికాహారం అయిన బాలామృతం అందటం లేదన్న విమర్శలు వస్తున్నవి. బాలింతలకు, గర్భిణీలకు ఆయా కేంద్రాల నుండి కోడి గుడ్డు, ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్ఠికాహారం అందించాల్సిన బాధ్యత ఉన్న అంగన్వాడి కేంద్రాలలో వివిధ కారణాలచే ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆయా కేంద్రాలలో అనారోగ్యంతో రాజీనామా చేసిన వారు, మరణించిన వారు, ప్రమోషన్‌పై వెళ్లిన వారి వల్ల ఖాళీగా ఉన్న కేంద్రాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వైరా మండలంలో కొద్ది నెలల క్రితమే అంగన్ వాడి హెల్పర్ ఖాళీలను భర్తీ చేశారు. టీచర్ పోస్టులు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నా ఆ శాఖ అధికారులు పక్కనే ఉన్న మరో సెంటర్ వారికి బాధ్యతలు అప్పగించి తూతూ మంత్రంగా కేంద్రాలను నడుపుతున్నారు. ఈ కేంద్రాలను నిర్వహించటం ఒక్కటే వీరి బాధ్యత కాదు. వీరికి అనేక అదనపు బాధ్యతలు అప్పగించి ప్రభుత్వ బడి టీచర్ల కంటే మూడింతలు పని చేయించటం చూస్తున్నాము. జీతం బెత్తెడు, బాధ్యత బారెడు అన్నట్లు వారి ఉద్యోగం ఉన్నా జీతం పెరుగుతుందన్న ఆశ వీరిని నడిపిస్తుంది. కాగా వైరా మండలంలో వైరా 10, బ్రాహ్మణపల్లి 1, జింకలగూడెం, పుణ్యపురం, విప్పలమడక, లింగన్న పాలెం, దాచాపురం, గండగలపాడు కేంద్రాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. కొణిజర్ల మండలంలో పెద్ద మునగాల -1, కొణిజర్ల -3, కొణిజర్ల( మిని), శాంతి నగర్, అమ్మపాలెం కేంద్రాల్లో టీచర్ పోస్టులు, కొత్తకాచారం, గుబ్బగుర్తి 1,2, లాలాపురం -2 కేంద్రాల హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. కారేపల్లి మండలంలో విశ్వనాథ పల్లి - 2, రూప్లా తండా( మినీ), హరిజన కాలని ( మినీ), ఉసిరికాయల పల్లి ఓసి( మినీ) గోవింద్ తండా, మాదారం ఎస్సి కాలని( మినీ), ఆర్ కె పురం (మినీ), మందుల గుంపు( మినీ)ఖాళీగా ఉన్నవి. అదే విధంగా హెల్పర్ పోస్టులు సింగరేణి - 2, విశ్వనాథ పల్లి - 2, తోడితల గూడెం, సీతారాం పురం - 2, కోమట్లగూడెం, పెరేపల్లి - 3, గాజుల తండా, రేగుల గూడెం, చెన్నంగుల తండా, రొట్టమాకు రేవులలో ఖాళీగా ఉన్నవి. ఏనుకూరు మండలం అంబేద్కర్‌నగర్ (మినీ)టీచర్ పోస్టు ఖాళీగా ఉండగా, టిఎల్ పేట - 4, నూకాలం పాడు, నాచారం 3, ఆరికాయల పాడు, ఏనుకూర్ - 3 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. జూలూరుపాడు మండలంలో జూలూరుపాడు - 1, పెద్ద హరిజనవాడ, బోజ్యా తండా (మినీ), టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, కాకర్ల 1, 2, 3, రామచంద్ర పురం, బత్తుల కోయగూడెంలలో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఈ కేంద్రాలలో ప్రాథమిక అక్షర జ్ఞానం, బాలామృతమ్, బాలింతలు గర్భిణీలకు అందవలసిన గుడ్డు పౌష్ఠికాహారం ఎలా అందుతున్నాయో పరిశీలన చేయాల్సి ఉంది.