Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
నీటిని నిల్వ చేసుకునేందుకు ఇంటివద్ద ఏర్పాటు చేసుకున్న సంపులో పడి ఓ యువకుడు మరణించిన ఘటన సత్తుపల్లిలోని వెంగళరావునగర్లో గురువారం రాత్రి జరిగింది. సత్తుపల్లి ఏఎస్సై నక్కా జయబాబు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక జేవీఆర్ ఓసీలో పనిచేస్తున్న ఎండీ గఫూర్ కుమారుడు సలీం (23) తనతల్లి హైమదితో కలిసి గురువారం రాత్రి 9గంటల సమయంలో ఇంటికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తండ్రి గఫూర్ డ్యూటీ దిగి ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో కుమారుడు, భార్య లేకపోవడంతో అతను కూడా అత్తగారికి ఇంటికెళ్లాడు. 10గంటల సమయంలో సలీం తనకు కడుపులో నొప్పిగా ఉందని, బాత్రూంకి వెళ్లొస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లిన కుమారుడు ఎంతసేపయినా రాకపోయే సరికి వెంటనే గఫూర్ తన భార్యను తీసుకొని ఇంటికెళ్లి చూడగా నీటి సంపులో కాళ్లు పైకి కనిపిస్తుండటంతో వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో సలీంను సంపునుంచి బయటకు తీసి 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు గఫూర్ సమాచారం ఇవ్వగా ఏఎస్సై జయబాబు కేసు నమోదు చేశారు. తమ కుమారుడు సలీం సంపులో పడి మరణించాడని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు లిఖితపూర్వకంగా గఫూర్ రాసి ఇచ్చాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.