Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంతర వైద్య సేవలందించేందుకే సహకారం
- జోయాలుకాస్ సంస్థ రీజినల్ మేనేజర్ రాబిన్ తంబి
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఖమ్మంకు చెందిన బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ జోయాలుకాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదున్నర లక్షల రూపాయల విలువ గల జనరేటర్ ను బహూకరించారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ ను ఎంపీపీ వజ్జా రమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ రాబిన్ తంబి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడినా వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం కొనసాగించేందుకే జనరేటర్ ను బహుకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల వారికి మరింత విశ్వాసాన్ని కలిగించవచ్చున్నారు. రానున్న వేసవికాలంలో ఆసుపత్రి పరిసర ప్రాంత రోగులకు అందించే వైద్య సేవలకు ఆటంకంగా మారే విద్యుత్ అంతరాయాలను అధిగమించేందుకు జనరేటర్ ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. జోయాలుకాస్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ప్రజలకు విస్తతమైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జనరేటర్‌ను బహూకరించిన జోయాలుకాస్ సంస్థ దాతలను ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జోయలుకాస్ సంస్థ ఖమ్మం మేనేజర్ మణికంఠ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ రాజేష్, ఎస్సై జి స్రవంతి, ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ ఈగ అనిల్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.