Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల భారం నుండి కాపాడండి
- సర్పంచ్ల డిమాండ్
నవతెలంగాణ-వైరా
మొక్కలు పెంచుతున్నాం, ట్రాక్టర్‌తో నీళ్ళు పోయిస్తున్నం, గ్రామాలను శుభ్రంగా ఉంచుతున్నాం. పెట్రోల్ బంకుల్లో వడ్డీలు కడుతున్నాము. ఎన్ని నెలలు మేము ఈ బాధలు పడాలని వైరా మండల సర్పంచ్‌లు మూకుమ్మడిగా అధికారులను నిలదీశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సర్పంచ్‌లు ఈ ట్రాక్టర్లు మాకొద్దు అని మొరపెట్టుకున్నారు. గ్రామ పంచాయతీలకు ఏవైనా కొన్ని నిధులు వస్తే ట్రాక్టర్ కిస్తీలకు సరిపోవటం లేదని, మేము గ్రామం కోసం అధికారులు చేయించే ప్రతి పనిని చేయటం అప్పులపాలవుతున్నామని అన్నారు. క్రీడా ప్రాంగణాల పనులు చేయించి 6 నెలలు గడిచినా డబ్బు చెల్లించకపోతే, అప్పు తెచ్చి చేయించిన పనులకు వడ్డీలు ఎవరు చెల్లించాలి. నష్టం ఎన్నాళ్ళు భరించాలని అష్ణగుర్తి, విప్పలమడక, కొస్టాల, తాటిపూడి, పినపాక సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించారు. అదే స్థాయిలో మిషన్ భగీరథ నీరు వరసగా 15 రోజులు ఏనాడూ రాలేదని అన్నారు. అందుకు ఏఈ సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం తగ్గిందని, ఇంటేక్ వెల్ లోకి నీరు వచ్చే పైపులు మట్టితో పేరుకు పోయినందున రిపేరు అవసరం అయిందని అన్నారు. వ్యవసాయ శాఖ ఏఓ పవన్ కుమార్ మాట్లాడుతూ రబీలో వేసిన పంటలకు మే 15 వరకు నీరు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా నిర్ణయించినట్లు తెలిపారు.మండలంలో రైతు బంధు ఇంకా 76,75,200 పెండింగ్‌లో ఉన్నాయని, 128 మంది రైతులు రైతు బీమాకు వారి పేర్లు నమోదు చేసుకోలేదని ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వారి పేర్లు ఉంచామని వెంటనే వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. గ్రామాలలో వంగి పోయిన కరెంట్ స్తంభాలను నిలబెట్టాలని కోరారు. విద్యుత్ బిల్లులలో ఏసిడి పేరుతో పేదలను ఇబ్బందుల పాలు చేయవద్దని సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. సమావేశంలో ఇంచార్జీ ఎంపిడిఓ రాధికా గుప్తా, తాసీల్దార్ ఎన్ అరుణ, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.