Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.9 కోట్లతో లక్షణంగా నిర్మించారు - నిర్లక్ష్యంతో నిరూపయోగం
- కాలిపోయిన మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్
- రూ 9.20 లక్షలు మంజూరు
- ప్రారంభం కానీ మరమ్మతు పనులు
నవతెలంగాణ - బోనకల్
మూడు గ్రామాల రైతుల కోసం 9 కోట్ల రూపాయలతో నిర్మించిన రాయన్నపేట-3 ఎత్తిపోతల పథకం మూడేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అయినా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో పంట పొలాలు సగం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోనే రాయన్నపేట గ్రామ సమీపంలో వైరా నదిపై రాష్ట్ర నీటిపారుదుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 9 కోట్ల రూపాయలతో రాయన్నపేట- 3 ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం కింద కలకోట, రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన 1100 ఎకరా సాగవుతుంది. 16 జనవరి 2014న ఆనాటి ప్రభుత్వ చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆ రోజు నుంచి 2018 వరకు ఏకధాటిగా మూడు గ్రామాల ప్రజలకు సాగునీరు అందించింది. 2019 నుంచి ఈ ఎత్తిపోతల పథకం మూలన పడింది. ఈ ఎత్తిపోతల పథకానికి మూడు మోటర్లు, ఒక కంప్లసర్ మోటార్ ఉన్నాయి. ఇందులో రెండు మోటార్లు, నీటిని ఎక్కించే కంప్లసర్ మోటార్ కాలిపోయింది. దీనికి తోడు ఈ ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ కూడా కాలిపోయింది. దీంతో తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా దర్శనమిస్తుంది. ఈ ఎత్తిపోతల పథకం కింద మూడు గ్రామాలకు చెందిన రైతులు మొదటి పంటగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ పత్తి పంట ప్రస్తుతం వర్షం ఆధారంగా పండుతుంది. రెండవ పంటగా అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేసేవారు. ఎత్తిపోతల పథకం పనిచేసిన సమయంలో రెండు పంటలను అన్నదాతలు పండించారు. మొదటగా పత్తి రెండవ పంటగా మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆ సమయంలో అన్నదాతలు ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందారు. కానీ 2019 నుంచి ఈ ఎత్తిపోతల పథకం పనిచేయకపోవడంతో ఈ మూడు గ్రామాలకు చెందిన అన్నదాతలు మొదటి పంటగా పత్తి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. అది కూడా వర్షం ఆధారంగానే సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు కలకోట చెరువుకి మోటార్ల ద్వారా నీరు పెట్టుకుంటున్నారు. 2019 నుంచి ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి 600 ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను కూడా నీటిపారుదల శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. 2019 నుంచి ఆయా గ్రామాల రైతులు స్థానిక ప్రజాప్రతినిధులకు, బోనకల్ మండల నీటిపారుదల శాఖల అధికారుల దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధుల, అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇటీవల రైతుల ఒత్తిడి మేరకు నీటిపారుదల శాఖ ఎస్సీ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అదేవిధంగా బోనకల్ డిఈ కూడా ఈ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అధికారులు ట్రాన్స్ ఫార్మర్, మోటార్లు మరమ్మతుల కోసం సుమారు 20 లక్షల రూపాయలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. మరమ్మత్తుల కోసం 20 లక్షల రూపాయలు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇటీవల ప్రభుత్వం కేవలం రూ.9.20 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. అధికారులు అంచనా ప్రకారం నిధులు మంజూరు చేయకుండా అందులో కేవలం సగం మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయటం విశేషం. ఈ నిధులతో పూర్తిస్థాయి మరమ్మత్తు పనులు పూర్తి కావడం అనుమానంగానే ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకుందని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎత్తిపోతల పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం సరైనది కాదని అన్నదాతలు విమర్శలు కురిపిస్తున్నారు. నిధులను మంజూరు చేసి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలి:కర్నాటి రామకోటేశ్వరరావు, రైతు, రాయన్నపేట
మూడు గ్రామాల ప్రజల కోసం నిర్మించిన ఎత్తిపోతల పథకం మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతు పనుల కోసం రూ. 9.20 లక్షల మంజూరు చేశారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్న నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. 2019 నుంచి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకం కింద భూములు చాలా వరకు నిరుపయోగంగా మారాయి. వెంటనే సంబంధిత అధికారులు మరమ్మ తు పనులు చేపట్టి ఎత్తిపోతల పథకాన్ని వినియో గంలోకి తీసుకురావాలని కోరారు.