Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాల పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధమైన ప్రజలు
- రెండుసార్లు అవకాశం ఇచ్చినా నిలుపుకొని కాంగ్రెస్
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
దేశం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా భద్రాచలం ఏజెన్సీ ప్రజలు మాత్రం ఎర్రజెండా విప్లవ పార్టీ వైపే ఉంటారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పోరాటాలు రూపొందించి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక సీపీఐ(ఎం)కే దక్కుతుంది. సీపీఐ(ఎం) తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు తుది శ్వాస విడిచే అంతవరకు ఏ ఒక్క అవినీతి మరక లేకుండా జీవించడమే కాక ఈ ప్రాంత గిరిజన గిరిజనేతర ప్రజల అభివృద్ధి కోసం వారి జీవితాలని త్యాగం చేశారన్న విషయం తెలియందే. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా బుజ్జి, సున్నం రాజయ్య ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన పోరాట ఫలితంగానే భద్రాచలం ప్రస్తుత అభివృద్ధి అని చెప్పాలి. బుజ్జి, రాజయ్య హయాంలోనే భద్రాచలం పట్టణానికి మూడు వాటర్ ట్యాంకులతో పాటు కరకట్ట నిర్మాణం పట్టణానికి మౌలిక వసతులతో పాటు అనేక నూతన కాలనీలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. భద్రాచలం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలలో చెక్కు డ్యామ్‌లతో పాటు వంతెనలు గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు, విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా ప్రజలకు అందించిన ఘనత సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులకే దక్కుతుందని చెప్పాలి. సీపీఐ(ఎం) నుండి గెలిచిన ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎంపీ మీడియం బాబూరావు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రజలతో మమేకమై సాధారణ జీవితాన్ని గడిపారు. పోలవరంతో భద్రాచలం ఏజెన్సీకి ముంపు వస్తుందని ముందే గ్రహించి అనేక రకాల పోరాటాలు చేసి జైలు జీవితాన్ని కూడా గడిపిన చరిత్ర ఒక సీపీఐ(ఎం)కే దక్కుతుంది.
రెండుసార్లు అవకాశం ఇచ్చినా నిలుపుకొని కాంగ్రెస్
2009లో ఒక అవకాశం ఇస్తే భద్రాచలం ఏజెన్సీ రూపురేఖలు మారుస్తామని సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా సత్యావతి తన వ్యక్తిగత స్వప్రయోజనం కోసం ఇసుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప భద్రాచలం ఏజెన్సీని ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా గిరిజన గిరిజనేతరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. 2018లో మరో అవకాశం ఏజెన్సీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ భద్రాచలానికి ఒక అతిధి ఎమ్మెల్యే లాగానే ఎమ్మెల్యే పొదెం వీరయ్య వ్యవహార శైలి ఉందే తప్ప ఏమాత్రం భద్రాచలం అభివృద్ధి నేర్చుకోలేదని చెప్పాలి. సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 250 డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయడమే కాక 2017లో శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం చొరవ చూపటం లేదు. దళిత బంధు పంపిణీలో కూడా అనేక రకాల అవినీతి ఆరోపణలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. భద్రాచలం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పాలి. ఇటీవల జరిగిన రేవంత్ రెడ్డి పాదయాత్ర పై కూడా ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం భద్రాచలంలో కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరిస్తున్నారని స్పష్టమవుతుంది.
ప్రజా పోరాటాలే మా హస్త్రం
భద్రాచలం ఏజెన్సీలో మతోన్మాద శక్తులను అడుగుపెట్టనీయకుండా కలిసొచ్చే శక్తులతో ఎన్నికల బరిలో దిగి, ప్రజా సమస్యలపై పోరాటాలే హస్త్రంగా ఎంచుకొని విజయం సాధిస్తాం. రాష్ట్ర విభజన సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోలవరం ముంపు పేరుతో భద్రాచలం ఏజెన్సీని ముక్కలుగా చేసి లబ్ది పొందారు. ఆనాడు సీపీఐ(ఎం) చెప్పిన మాటే నేడు నిజమై పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలమునకు ముంపు పొంచి ఉంది. భవిష్యత్తులో భద్రాచలం పరిరక్షణ కోసం సీపీఐ(ఎం)ను గెలిపించాలి. భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలలో 150 శాఖలు, 1200 మంది పార్టీ సభ్యులతో పాటు సుమారు 2000 మంది ప్రజాసంఘాల బాధ్యులు కలిగి బలమైన శక్తిగా సీపీఐ(ఎం) భద్రాచలంలో ప్రజా పునాది కలిగి ఉంది. రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతోపాటు అభ్యుదయ భావవాదులు సామాజిక సంఘాలతో కలుపుకొని భద్రాచలం ఎన్నికల బరిలో గెలిచి తీరుతాం. భద్రాచలం చరిత్రలో సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలాలు పార్టీని తిరిగి గెలిపిస్తాయి. భద్రాచలం సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న సీపీఐ(ఎం) ప్రజలు తప్పక ఆదరిస్తారు.
- సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు