Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి మతోన్మాద ప్రమాదం తిప్పికొట్టేందుకే
- 17న జన చైతన్య యాత్రలు
- సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నేలకొండపల్లి
ఖమ్మం డివిజన్లో సిపిఐ(ఎం)ను అగ్రభాగాన నిలపడంలో, సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన ఉద్యమ కెరటం చావా అప్పారావు ఆదర్శప్రాయుడని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. సోమవారం మండలంలోని మోటాపురం గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన చావా అప్పారావు సంస్మరణ సభ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి ఇంటూరి అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మినేని తొలుత అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ చావా అప్పారావు చిన్ననాటి నుండి సిపిఐ(ఎం) పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావం, నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. తన జీవన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ అన్నింటిని అధిగమిస్తూ తన చివరి శ్వాస వరకు ఎర్రజెండా కోసం తపించిన మహౌన్నత వ్యక్తి అన్నారు. ఆయన మరణం పార్టీ అభివృద్ధికి తీరని లోటు అన్నారు. నేడు రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రమాదం పొంచి ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యానికి లౌకికతత్వానికి ఆయువుపట్టుగా ఉన్న రాజ్యాంగం స్థానంలో బిజెపి ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రమాదకరమైన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం, అధికారం ముసుగులో మను ధర్మశాస్త్రాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రానున్న కాలంలో దానిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మరోపక్క తన అధికార అహంకారంతో ప్రభుత్వరంగ సంస్థలను కొంతమంది కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అప్పనంగా దోచిపెడుతుందని విమర్శించారు. బిజెపి కుట్రపూరిత రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా వారి విధానాలను తిప్పి కొట్టి మతసామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జన చైతన్య బస్సు యాత్రలను ఈ నెల 17న ప్రారంభించునున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి మతోన్మాద విధానాలను ఎండగట్టడమే చావా అప్పారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. అనంతరం ఇటీవల గ్రామంలో అనారోగ్యంతో మరణించిన శ్యామలేటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాదు, బిజెపి జిల్లా కార్యదర్శి నున్నా రవికుమార్, టిడిపి జిల్లా నాయకులు శివయ్య, సిపిఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు భూక్య వీరభద్రం, జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, బండి పద్మ, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు గుడిమళ్ల మధు, సిపిఐ(ఎం) నాయకులు ఏలూరి రంగారావు, రచ్చ నరసింహారావు, రాసాల కనకయ్య, బెల్లం లక్ష్మి, గుగులోతు వీరు నాయక్, కట్టెకోల వెంకన్న, పెద్దిరాజు నరసయ్య, భాగం నరసింహారావు, ఏలూరి రామారావు, అప్పారావు కుమారులు చావా లెనిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.