Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి కూడా ఆయనే సీఎం
- వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరి చిల్లర విమర్శలు
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-సత్తుపల్లి
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని, ఒకవేళ ఎవరైనా కలలు కన్నా అవి కలలుగానే మిగిలిపోతాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో సండ్ర మాట్లాడారు. సత్తుపల్లి అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సత్తుపల్లికి కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తొలిభారీ బహిరంగ సభలో సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.30కోట్లు, తల్లాడ, కల్లూరు మేజర్ పంచాయ తీలకు చెరో రూ.10కోట్లు కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. కేటీఆర్ హామీ మేరకు ఇప్పటికే రూ.30కోట్లు మంజూరు, సత్యనారాయణపురం ఆసుపత్రి శంకుస్థాపనకు వచ్చినపుడు మంత్రి హరీశ్‌రావు రోడ్ల నిర్మాణ పనులకు జీవో జారీ ఉదంతాలే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 65 కమ్యూనిటీహాళ్లను మంజూరు చేయించుకుని శంకుస్థాపన చేసుకున్నామని, శుభకార్యాలకు ఉపయోగపడేలా వివిధ కమ్యూనిటీ హాళ్లు నిర్మించుకున్నామన్నారు. ఇంతటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకోసం ప్రభుత్వంపై, తనపై చిల్లర విమర్శలు చేస్తున్నారని సండ్ర మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీన కల్లూరు, పెనుబల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలకు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. కందుకూరులో జరుగుతున్న శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణ మహౌత్సవాలకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి హాజరవుతారని, సత్తుపల్లి నుంచి భారీ ర్యాలీగా కందుకూరు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, నాయకులు దొడ్డా శంకరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.