Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా ప్లీనంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి ప్రధమ శత్రువు బీజేపీ అని, తన మతోన్మాద చర్యల ద్వారా దేశంలో ప్రజల మధ్య సమైక్యతకు బీజేపీ విగాథం కలిగిస్తుందని, ప్రజా సంక్షేమం, దేశ సమైక్యత కోసం బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనం సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.జ్యోతి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరై తమ్మినేని హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య బీజేపీ మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ఎన్నికల నాడు దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది బడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. అంబానీ, అదాని అభివృద్ధే దేశం అభివృద్ధి లాగా బీజేపీ భావిస్తుందని తమ్మినేని పేర్కొన్నారు. దేశ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని తమ్మినేని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసమే బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేస్తుందన్నారు. ప్రజలమధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ లక్ష్యంగా ఉందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలు పూర్తిగా నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కుల పైన బీజేపీ ఉన్మాదపూరితమైన దాడులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి విచ్చిన్నం చేయటానికి బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిపారు. మతోన్మాద చర్యల నుండి తెలంగాణను, మతోన్మాదం పైన పోరాడుతున్న లౌకిక శక్తుల తోటి సీపీఐ(ఎం) కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎటువంటి షరతులు లేకుండా గ్రామ సభలు ఆమోదించిన హక్కు పత్రాలన్నింటినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరకట్ట నిర్మాణంపొడిగింపుకు భద్రాచలం అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయటం కోసం సీపీఐ(ఎం) పోరాడుతుందని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి, భద్రాచలం ప్రజల సంక్షేమం కోసం సీపీఐ(ఎం) అనేక పోరాటాలను, త్యాగాలను చేసిందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) పోరాటాలు, పార్టీ ప్రజాప్రతిని కృషి, నాయకుల బలిదానాల వల్లనే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి సాధించిందన్నారు. విద్యా, వైద్యం మౌలిక వసతుల కల్పనలో భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రాతినద్యం వహించిన సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు కృషి చేశారని తమ్మినేని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో భద్రాచలం గడ్డపై ఎర్రజెండాను ఎగరేస్తామని, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) నియోజకవర్గ కో కన్వీనర్‌గా కారం పుల్లయ్య ఎన్నిక
సీపీఐ(ఎం) భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్‌గా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య ఎన్నికయ్యారు. పార్టీ జిల్లా ప్లీనంలో తమ్మినేని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మచ్చా వెంకటేశ్వ ర్లకు తోడుగా పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లడం కోసం కారం పుల్లయ్యను కోకన్వీనర్‌గా నిర్ణయించింది. పార్టీ జిల్లా ప్లీనం సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మీడియా బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, సూడి కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ములుగు జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, కే.బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి, పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు పిట్టల రవి, సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్, ములుగు జిల్లా నాయకులు బి రెడ్డి సాంబశివ, దబ్బకట్ల లక్ష్మయ్య, రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, గడ్డం స్వామి, మర్లపాటి రేణుక, సున్నం గంగా, సరియం రాజమ్మ, సరియం కోటేశ్వరరావు, దొడ్డ రవి, కున్సోత్ ధర్మ, నబి, బి.రమేష్ రేపాకుల శ్రీనివాస్, జి.పద్మ, ఎలమంచి వంశీ, నిమ్మల వెంకన్న, గద్దలశ్రీను తదితరులు పాల్గొన్నారు.