Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 'ఆరోగ్య మహిళ'కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. మహిళల ఆరోగ్యంలో ప్రసవాలు అత్యంత కీలకం. ఇవి సహజంగా జరిగితే మహిళలతో పాటు కుటుంబ ఆరోగ్యం పెంపొందుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రసవాల ఆవశ్యకత... ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ.. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం ' సందర్భంగా 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం.
- ఏటేటా కాన్పుల్లో అధికమవుతున్న 'కోత'లు
- ఆపరేషన్ లేకుండా పిల్లలను కనలేమా...?
- సైన్సెంత విస్తరించినా సిజేరియన్ లు తప్పవా?
- కార్పొరేట్, ప్రైవేటు విపరీత కాసుల కక్కుర్తి..
- ప్రభుత్వ ఆస్పుత్రుల్లోనూ ఆపరేషన్ లే అధికం
- సర్కారు ప్రోత్సాహకాలు.. అవగాహన సదస్సులు వృథాయేనా?
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం... 'ఆరోగ్య మహిళ'కు శ్రీకారం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా... కొందరు డాక్టర్ల ధన దాహం.. గర్భిణుల సంకల్ప లోపం... పేరెంట్స్ వైపు నుంచి లోపిస్తున్న సహకారం.. వెరసి సహజ ప్రసవాలు అసహజంగా మారుతున్నాయి. కడుపు 'కోత'తో కూడిన ప్రసవాలు అధికమవుతున్నాయి. ఈ కారణంగా మహిళల ఆరోగ్యం క్షీణిస్తోంది. దీర్ఘకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు సిద్ధపడుతున్న స్త్రీలు.. కొద్దిపాటి ప్రసవ వేదనను ఎదుర్కొనేందుకు సన్నద్ధులు కాకపోవడం ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు కాన్పు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధారణ ప్రసవాలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య నానాటికి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఎడాపెడా ఆపరేషన్లు చేస్తుండడం విస్మయం గొల్పుతోంది. సాధారణ ప్రసవాలతో పోలిస్తే సిజేరియన్లతో బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతోనే పలువురు డాక్టర్లు ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం సాధారణ కాన్పులపై దష్టి సారించింది. కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను నిర్వహించాలని ఆదేశించింది. అయితే చాలా ఆసుపత్రుల్లో 80% పైగా సిజేరియన్లు జరుగుతుండడంతో ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కాన్పులే పరమావధిగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జిల్లా అధికారులు తరచుగా సమీక్ష నిర్వహిస్తున్న ఫలితం ఉండడం లేదు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఏడాది కాలంగా సహజ ప్రసవాలపై గైనకాలజిస్టులతో ప్రతి నెల సమావేశం నిర్వహిస్తున్నారు. సహజ ప్రసవాలపై సమాచారం తీసుకుంటున్నారు. సిజేరియన్లు చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మారకపోవడం గమనార్హం.
సిజేరియన్లతో దోపిడీ
ఖమ్మం నగరంలో ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా సాధారణ కాన్పుకు రూ. 20,000 నుంచి 30 వేల వరకు బిల్లు చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో బిల్లు మరింత ఎక్కువ. అదే సిజేరియన్ అయితే ఇంతకు రెండు, మూడు రెట్లు డబ్బులు అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం కార్పొరేట్ ఆసుపత్రిలో రూ. లక్ష వరకు బిల్లు వస్తుండటంతో యాజమాన్యాలు ఎక్కువగా కడుపుకోసేందుకే ప్రాధాన్యం మిస్తున్నాయి దీనికితోడు బిడ్డ జన్మనిచ్చే సమయాన్ని ముహూర్తం ఆధారంగా తల్లిదండ్రులు నిర్ణయించుకుంటున్నారు. పురిటి నొప్పులు భరించలేని కుటుంబీకులు చెబుతుండడాన్ని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్లు నిర్వహించాల్సి ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల తల్లి ఆరోగ్యం త్వరగా దెబ్బతినడంతో పాటు బిడ్డపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నా ఎవరికీ పట్టడం లేదు. ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాలని నిబంధనలు చెప్తున్నా ఇవేమీ పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బుల కోసం కత్తులతో కడుపు చీల్చి మరీ కాన్పు చేస్తున్నారు.
సర్కారు ఆసుపత్రుల్లో పెరుగుతున్న సహజ ప్రసవాలు..
గతంలో ప్రైవేట్ అస్పత్రుల్లోనే ప్రసవాలు ఎక్కువగా జరిగేవి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, ఆస్పత్రుల్లో వైద్యుల నియామకం, సౌకర్యాల కల్పన తదితర అంశాలతో సర్కారు దవాఖానాల్లోనూ ప్రసవాలు పెరుగుతూ వస్తున్నాయి. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన నాటి నుండి జిల్లాలో ఇప్పటి వరకు 52,858 ప్రసవాలు 46,162 మందికి జరగగా కేసీఆర్ కిట్లు అందించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించలేకపోతుండడం గమనార్హం. గత మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,465 సాధారణ ప్రసవాలు నిర్వహించగా 15,214 ఆపరేషన్స్ చేశారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో మూడేళ్లలో సాధారణ ప్రసవాలు 4,507 నిర్వహించగా 21,718 సిజేరియన్లు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయివేటులో నూటికి 21 శాతం మాత్రమే సహజ ప్రసవాలు చేస్తుండటం గమనార్హం.
ప్రయివేటులో ఒకవంతే సహజ ప్రసవాలు...
ఈ ఏడాదిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మూడొంతుల ఆపరేషన్లు చేస్తే ఒక వంతు మాత్రమే సాధారణప్రసవాలు చేశారు. ప్రయివేటులో మొత్తం 7,449 ప్రసవాలు కాగా వీటిలో 5,773 ప్రసవాలు సిజేరియన్లు. కేవలం 1,676 మాత్రమే సాధారణ ప్రసవాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9,035 కాన్పులకు గాను 4,415 సాధారణ, 4,620 సిజేరియన్లు అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమేరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నా ప్రైవేటు లో మాత్రం విచ్చల విడిగా ఆపరేషన్లు నిర్వహిస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. కేవలం కాసులకు కక్కుర్తిపడే ఆపరేషన్ల నిర్వహణకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు మొగ్గు చూపుతున్నట్లు పలువురి ఆరోపణ. ఏడాది మహిళా ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా సాధారణ ప్రసవాలపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సహజ ప్రసవం ఆరోగ్యపరంగా ఉత్తమం
డాక్టర్ యలమంచిలి రమాదేవి, గైనకాలజిస్టు
సహజ ప్రసవం ఆరోగ్యపరంగా ఎంతో ఉత్తమమని గర్భిణులు వారి తల్లిదండ్రులు గమనించాలి. ప్రభుత్వం, డాక్టర్లు సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నా కొందరు ఏమాత్రం పురిటి నొప్పులను భరించేందుకు సిద్ధపడటం లేదు. నార్మల్ డెలివరీ కి పేషెంట్ సంకల్పం ఎంతో కీలకం. ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ వెయిట్ పెరగడం సహజ ప్రసవానికి అవరోధం. కొద్దిపాటి వాకింగ్, వ్యాయామం చేస్తే సహజ ప్రసవాలు పెరిగే అవకాశం ఉంది. సహజ ప్రసవాలు జరిగినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషించేది డాక్టర్లే అని గుర్తించాలి.