Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరు శాఖల మధ్య నలిగిపోతున్న అన్నదాతలు
నవతెలంగాణ - బోనకల్
సాగర్ నీటి సరఫరాపై మండల వ్యవసాయ శాఖ బోనకల్ సబ్ డివిజన్ నీటిపారుదల శాఖ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇరు శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా యాసం గిలో 15,277 ఎకరాలలో అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేశారు. మండల వ్యాప్తంగా అత్యధికంగా లక్ష్మీపురంలో 3,168 ఎకరాలలో ముష్టికుంట గ్రామంలో 1,789 ఎకరాలలో ఆ తర్వాత ఆళ్ళపాడు 1,446 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. చిరునోములలో 1,319 పెద్ద బీరవల్లిలో 1,197 రావినూతలలో 1,079 ఎకరాలలో మొక్కజొన్న పంటను అన్నదాతలు సాగు చేశారు. గార్లపాడు 1,015 ఎకరాలలో బోనకల్లో 823 ఎకరాలలో 718 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. నారాయణపురంలో 415 ఎకరాల్లో కలకోటలో 446 ఎకరాలలో మోటమర్రిలో 122 ఎకరాలలో రాపల్లిలో 150 ఎకరాలలో బ్రాహ్మణపల్లిలో 51 ఎకరాలలో గోవిందాపురం(ఏ) 141 ఎకరాలలో చిన్న బీరవల్లిలో 392 ఎకరాలలో రామాపురంలో 229 ఎకరాలలో మొక్కజొన్న పంటను అన్నదాతలు సాగు చేశారు. సాగు చేసిన మొక్కజొన్న పంట మొత్తం కూడా బోనకల్ బ్రాంచి కెనాలు పరిధిలోనే ఉంది. బోనకల్ బ్రాంచి కెనాల్ పరిధిలోనే ప్రధానంగా కలకోట మేజర్, నారాయణపురం, ఆళ్లపాడు, డబ్బాకుపల్లి, పోలంపల్లి మైనర్ల కిందనే బోనకల్లు మండల అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేశారు. లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన రైతుల మాత్రమే ఎక్కువ భాగం వ్యవసాయ విద్యుత్ మోటార్ల కింద సాగు చేస్తున్నారు మిగిలిన 20 గ్రామాలకు బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారానే పంటలకు సాగునీరు సరఫరా జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ నుంచే అసలు సమస్య ప్రారంభమైంది. ఈ మైనర్ల కింద సాగు చేసిన మొక్కజొన్న పంట వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా 15 వేల ఎకరాలలో సాగు చేయలేదని బోనకల్ సబ్ డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ కింద యాసంగిలో చాలా తక్కువగా మొక్కజొన్న పంటను సాగు చేశారని, అందుకు అనుగుణంగానే బోనకల్ బ్రాంచ్ కెనాల్ కు ఉన్నతాధికారులు సాగర్ నీటిని సరఫరా చేస్తున్నారని బోనకల్ సబ్ డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల తప్పుడు లెక్కలు వల్లే సాగర్ నీటి సమస్య ఏర్పడిందని నీటిపారుదుల శాఖ అధికారులు అంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయ శాఖ అధికారులు దీటుగా స్పందించారు. అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాలలో రైతులతో కలిసి పంట సాగు వివరాలు నమోదు చేశారని తెలిపారు. మొక్కజొన్న పంట నమోదు విషయంలో ఎటువంటి పొరపాట్లు లేవని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులపై బోనకల్ సబ్ డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.