Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు నిర్వాణ
- మారుమూల ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయాలి
- డీఈఓని ఆదేశించిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
విద్యార్థి దశకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నవి 10వ తరగతి పరీక్షలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లుపై ఐడీఓసీ కార్యాలయంలో విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, రవాణా, విద్యుత్, మిషన్ బగీరథ, ఐటీడీఏ, పంచాయతీ, మున్సిపల్, ఆర్టీసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 334 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 12962 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 70 ప్రభుత్వ, 2 ప్రయివేట్ మొత్తం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయని చెప్పారు. 72 సిట్టింగ్ స్క్వాడ్, డిప్యూటి తహసిల్దారులు, ఎస్సైలతో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తూ ప్రోసీడింగ్స్ జారీ చేయాలని డీఆర్ఓకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించాలని చెప్పారు. మన ఊరు మనబడి మరమ్మతులు జరుగుతున్న పాఠశాల్లో పరీక్షలు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి సౌలభ్యం కొరకు అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు, మరుగుదొడ్లు నిర్వహణ తీరును పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దివ్యాంగులకు ప్రత్యేక రూములు కేటాయించాలని చెప్పారు. స్క్రైబ్స్ అవసరయ్యే విద్యార్థుల జాబితా ప్రకారం ముందుగానే స్క్రైబ్స్ ఏర్పాటు చేయు విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు కొరతరాకుండా స్క్రైబ్స్ను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లుపై ఆయా కేంద్రాల ఛీఫ్ సూపర్వైజర్ల నుండి చెక్ లిస్టు సేరించాలని చెప్పారు. పరీక్షలు నిర్వహణలో సలహాలు, సూచనలు కోసం డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని చెప్పారు. గత సంవత్సరం పరీక్షలు చాలా బాగా నిర్వహించామని, అదే స్పూర్తితో ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రశ్నా, జవాబు పత్రాలను తరలించే సమయంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉండాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమశేఖరశర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, యంవిఐ జయపాల్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ విజయబాబు, విద్యుత్ శాఖ డీఈ వెంకటరత్నం, పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రజిత్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.