Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ భూములకు మొక్కలు పంపిణీ
- ఆయిల్‌ఫెడ్ ఎం.డి సురేందర్
నవతెలంగాణ-అశ్వారావుపేట
పెరిగిన ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం అనుగునంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పరిశ్రమల సామర్థ్యాలను పెంపుదల చేస్తామని ఆయిల్‌ఫెడ్ ఎం.డీ సురేందర్ తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.120 కోట్లు అంచనాతో ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు. ఆయన అశ్వారావుపేటలో కొత్తగా నిర్మించే బాయిలర్ స్థలాన్ని గురువారం పరిశీలించారు. సివిల్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ శివ నాగి రెడ్డి, ఏఈ సిద్ధార్థలను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.30 కోట్లతో అప్పారావుపేట ఫ్యాక్టరీని 60 నుండి 90 మెట్రిక్ టన్నులు రూ.30 కోట్లతో అశ్వారావు పేట ఫ్యాక్టరీ రూ.30 నుండి 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యాలుకు విస్తరిస్తున్నాము అని, వచ్చే రెండేళ్లలో అందుకు అవసరమైన దిగుబడులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఏడాదిలో 35 వేల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగు కొత్త ప్లాంటేషన్ పూర్తి చేసాం అని, వచ్చే ఏడాది నుండి దిగుబడులు ఉంటాయని అని అన్నారు. అలాగే అశ్వారావుపేటలో నిర్మించే కొత్త బాయిలర్ సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతుందని, బాయిలర్ పనుల కోసం త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 24 నాటికి బాయిలర్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. రైతుల సౌకర్యార్థం అశ్వారావుపేటలో కొత్త వే బ్రిడ్జి, ప్లాంట్ ఫాం నిర్మించామని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెరిగిన ప్లాంటేషన్ నుండి వచ్చే దిగుబడులకు అనుగుణంగా కొత్త ఫ్యాక్టరీలను నిర్మిస్తామని, వచ్చే ఏడాదిలోగా సిద్ధిపేటలో కొత్తగా పరిశ్రమను నిర్మించనున్నామని, అందుకు తోటలు పెంచుతున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోనూ మరో ఫ్యాక్టరీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. మరో 7 నుండి 8 ఏళ్ళ వరకు సాగులో ఉన్న ఆయిల్ ఫాం తోటలతో పాటు కొత్త ప్లాంటేషన్ ద్వారా గెలలు దిగుబడులు పెరిగినా, క్రసింగ్ చేసే సామర్థ్యాలను రైతులకు అందుబాటులో తీసు కొస్తున్నామని అన్నారు. భూములకు పట్టాలు లేని లేని రైతులకు పూర్తి ధరకు మొక్కలను పంపిణీ చేస్తామని, ఎవరైనా రైతులు ఉంటే డివిజనల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పోడు పట్టాలు పొంది, సాగునీటి వనరులు ఉన్న భూములకు కూడా ప్రభుత్వ నిర్ణయం చేస్తే మొక్కలు సరఫరా చేస్తామని తెలిపారు. ఆయన వెంట జీఎం సుధాకర్ రెడ్డి, పీఅండ్పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ బాలక్రిష్ణ, అప్పారావుపేట మేనేజర్ కళ్యాణ్ గౌడ్, నాగబాబు, వెంకట్, ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ సాగుదారుల సంఘం నాయకులు కే.పుల్లయ్య తదితరులు ఉన్నారు.