Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు పూర్తి కాకుండానే మొండి గోడలకు డ్రా పద్ధతి
- ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే
- అర్హులైన పేదలకు ఇండ్లు దక్కేవరకు పోరాడుతాం
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కాకుండానే మొండి గోడలకు డ్రా తీసి ప్రజలను మోసం చేయడం కలెక్టర్ సాబ్... ఇది కరెక్టేనా...? అని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కేవరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) సీనియర్ నేత, కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ కాసాని ఐలయ్య అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, అనర్హులకు కేటాయించిన ఇల్లు రద్దు చేసి, పేదలకు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాసాని ఐలయ్య మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అధికార పార్టీ కౌన్సిలర్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇల్లు కేటాయించారన్నారు. ఇండ్ల కేటాయింపులో వార్డు కౌన్సిలర్ల చేతివాటం ప్రదర్శించారని, అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాసాని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎంపిక ప్రక్రియ జరిగిందా...? అని ప్రశ్నించారు. జరిగిన అవినీతికి ఎమ్మెల్యే భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరిగిందని కలెక్టర్ ప్రకటనలో వాస్తవం లేదని ఆయన ఆరోపించారు. పారదర్శకంగా జరిగితే అర్ధరాత్రి ఒకరోజు ముందు లబ్ధిదారుల లిస్టు తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. వార్డు సభ నిర్వహించకుండా స్థానిక వార్డు పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఎలా పారదర్శకతను ప్రదర్శించారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
పారదర్శకంగా ఎంపిక జరిగితే లబ్ధిదారుల పేరులు ఎందుకు నోటీస్ బోర్డులో ఉంచలేదో చెప్పాలన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియ చేయమన్నారు కానీ అసలు డ్రా తీసిన వారి లిస్ట్ బయటికి ఇవ్వకుండా ఎలా తెలియాచేస్తారన్నారు. ప్రజల ఆశలు, అవసరాలను కౌన్సిలర్లు, అధికారులు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రీ సర్వే చేసి అనర్హులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని, వార్డు సభలు నిర్వహించి వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలకు ఇండ్లు దక్కే వరకు ప్రజల తరఫున పోరాడుతామని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ డ్రా తీసిన వారి లిస్ట్ శుక్రావారం సాయంత్రం నాటికి నోటీస్ బోర్డ్‌లో ఏర్పాటు చేస్తామని, అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా తెలియజేయ వచ్చని స్పష్టం చేశారు. అర్హులకు న్యాయం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, విజయగిరి శ్రీను, బుర్ర వీరభద్రం, నవీన్, నాగకృష్ణ, కుక్కల ముత్తేశ్, రాజ్యలక్ష్మి, జ్యోతి, రమ పవన్, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.