Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయ వనరులు పెంపొందించాలి
- ట్యాంక్‌బండ్‌గా వేశ్యకాంతల చెరువు
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
- ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఎమ్మెల్యే సండ్ర అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సత్తుపల్లి పురపాలకవర్గం రూ. 77.20 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను కలెక్టర్ గౌతమ్ ఆమోదించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంపొందించే దిశగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా సత్తుపల్లిలో ప్రత్యేక మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరం మరిన్ని నిధులను సమకూర్చుకొని సత్తుపల్లిని మరింతగా అభివృద్ధి చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్ల జీతాలు ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేవని, వారికి రూ. 15వేల వరకు వేతనం పెంచడం జరిగిందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి, ప్రజలకు మంచి వాతావరణాన్ని అందించి పాలకవర్గం మంచిపేరు తెచ్చుకోవాలని కలెక్టర్ గౌతమ్ కోరారు. ప్రభుత్వం గ్రాంట్స్ ద్వారా రూ. 60కోట్లు కేటాయించిందన్నారు. ఆయా నిధులతో ఈ యేడాది అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. యేడాదిలోనే సత్తుపల్లి రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్నారు. బడ్జెట్లో 10శాతం గ్రీనరీకి కేటాయించాలన్నారు. గృహ, వాణిజ్య సముదాయాలన్నింటిని గుర్తించి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలన్నారు.
ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ప్రత్యేక ప్రణాళికతో సత్తుపల్లిని అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అధికంగా నిధులు మంజూరు చేయించుకొని పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను త్వరలో పూర్తి చేయడం జరుగుతోందన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అర్బన్ పార్కును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అర్బన్ పార్కును సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు.
వేశ్యకాంతల చెరువును 'ట్యాంక్‌బండ్'గా మార్చండి
: కలెక్టర్ గౌతమ్
బడ్జెట్ సమావేశానంతరం కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యే సండ్రతో కలిసి వేశ్యకాంతల చెరువును సందర్శించారు. చెరువును ట్యాంక్‌బండ్‌గా తీర్చి దిద్దాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసండి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, పీఆర్ ఈఈ రంజిత్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, నరుకుళ్ల మమత పాల్గొన్నారు.