Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటివెలుగు శిబిరాల్లో కళ్లద్దాలు ఆలస్యం
- రెండునెలలు కావస్తున్నా తప్పని ఎదురుచూపు
- ప్రిస్కిప్షన్ లెన్స్ ఇవ్వడంలో తీరని జాప్యం
- స్టాక్ లేదు..రాగానే ఫోన్ చేస్తామని సమాధానం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 18న ఖమ్మం కేంద్రంగా నలుగురు ముఖ్యమంత్రుల సాక్షిగా ప్రారంభించిన కంటివెలుగు శిబిరాల నిర్వహణలో అనేక లోటుపాట్లు వెలుగు చూస్తున్నాయి. కంటిపరీక్షల్లో సైట్ ప్రాబ్లమ్ ఉన్నవారికి అత్యంత కీలకమైన కళ్లద్దాలు సకాలంలో అందడం లేదని బాధితులు వాపోతున్నారు. రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తొలిరోజే కంటిపరీక్షలు చేయించుకుని దగ్గర, దూరం దృష్టిలోపం ఉన్నవారికి ప్రిస్కిప్షన్ రాసిచ్చారు. వారికి వెంటనే కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉండగా దాదాపు రెండునెలలు కావస్తున్నా ఇంకా ఇవ్వలేదు. స్టాక్ లేదు...రాగానే ఫోన్ చేస్తామని అధికారులు చెప్పి పంపారు..కానీ నేటి వరకూ కళ్లజోళ్లు అందకపోవడంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
విడతల వారీగా స్టాక్...
కంటివెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకునేందుకు పలువురు తరలివస్తున్నారు. దృష్టిలోపం ఉండి...ఇప్పటికే కళ్లద్దాలు వాడుతున్న అనేక మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. శిబిరానికి వచ్చిన వారికి సిబ్బంది కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు ఇవ్వాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. పలు ప్రాంతాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని శిబిరాలకు తరలిస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ పరీక్షలు చేయిం చుకునే వెసులుబాటు ఉండటంతో ఆ మేరకు బాధితులు ఆయా శిబిరాలకు వెళ్తున్నారు. అంతాబాగున్నా... కంటిపరీక్షలు చేయించుకున్న వెంటనే దృష్టిలోపం ఉన్నవారికి సరిపడా కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో మాత్రం రోజుల తరబడి కళ్లద్దాల కోసం వేచిచూడాల్సి వస్తోంది. స్టాక్ లేదనే పేరుతో అధికారులు ఫోన్ నంబర్ తీసుకుని రాగానే సమాచారం ఇస్తామంటున్నారు. కానీ రెండోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనవరి 18న పరీక్షలు చేయించుకున్న వారికి సైతం నేటి వరకు కళ్లద్దాలు అందలేదనే ఆరోపణలు వస్తున్నాయి. విడతల వారీగా స్టాక్ వస్తుండటంతో వచ్చిన వాటిని వచ్చినట్లు పంపిణీ చేస్తున్నామని అధికా రులు అంటున్నారు. ఆయా జిల్లాలకు అవసరాన్ని బట్టి కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నారు. కానీ వారానికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ 3,200 నుంచి 3,500 వరకు వస్తున్నాయి. ఇప్పటికీ నాలుగు విడతలుగా 9,032 దూరందగ్గర చూపు గ్లాసులు వచ్చాయి. తిరిగి గురువారం కూడా 3,874 ప్రిస్కిప్షన్ కళ్లజోళ్లు వచ్చినట్లు డీఎంహెచ్వో మాలతి తెలిపారు.
4 శాతం మందికి ప్రిస్కిప్షన్ స్పెక్టికల్స్ పంపిణీ
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 2.40 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 34వేల మందికి పైగా ప్రిస్కిప్షన్ స్పెక్టికల్స్ అవసరమని నిర్ధారించారు. వీరిలో కేవలం 9,032 (సుమారు 4శాతం) మందికి మాత్రమే పంపిణీ చేశారు. 56,105కు పైగా మందికి రీడింగ్ గ్లాసెస్ ఉపయోగించాలని వైద్యులు సూచించారు. రీడిండ్ గ్లాసెస్ వెంటనే ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... పేషెంట్స్ మాత్రం విభేదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 1.70 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 45వేల మంది వరకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ప్రిస్కిప్షన్ స్పెక్టికల్స్ 2,500 మంది వరకు ఇచ్చారు. ఇంకా 800 మందికి ఇవ్వాల్సి ఉంది.
విడతల వారీగా స్టాక్ వస్తోంది..
- మాలతి, డీఎంహెచ్వో, ఖమ్మం
కంటివెలుగు శిబిరాలను సమర్థ వంతంగా నిర్వహిస్తున్నాం. పరీక్షలు అయిన వెంటనే కళ్లజోళ్లు ఇస్తున్నాం. రీడిండ్ గ్లాసెస్ కొరత లేదు. కానీ ప్రిస్కిప్షన్ కళ్లజోళ్లు మాత్రం సరిపడా అందుబాటులో లేవు. వారానికి 3,200 నుంచి నాలుగు వేల వరకు వస్తున్నాయి. ఇప్పటికీ నాలుగు విడతల్లో వచ్చాయి. గురువారం మరోవిడత కోసం 3,874 కళ్లద్దాలు వచ్చాయి. దూరం, దగ్గర రెండూ కనబడకపోతేనే ప్రిస్కిప్షన్ రాస్తాం. దగ్గర చూపు సరిగా లేనివారికి రీడిండ్ గ్లాసెస్ ఇస్తాం. వీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
నెలన్నరకు పైనయినా ఇంత వరకు కళ్లద్దాలు ఇవ్వలేదు..
నాకు 70 ఏళ్లు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించిన జనవరి 18వ తేదీ (తొలిరోజు)న నగరంలోని 43వ డివిజన్ రేవతిసెంటర్ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. డాక్టర్లు మంచిగా చూశారు. నా కుడికన్నుకు 2.5 సైట్ ఉందని తేల్చారు. నాకు దూరం, దగ్గర చూపుకు సంబంధించిన కళ్లద్దాలు అవసరమని చెప్పారు. మా దగ్గర దూరం చూపువు లేవు..దగ్గరవి మాత్రమే ఉన్నాయన్నారు. స్టాక్ వారం పదిరోజుల్లో వస్తుంది...రాగానే మీకు ఫోన్ చేసి సమాచారం ఇస్తామన్నారు. ఇప్పటికీ నెలన్నరకు పైగా అయింది. కానీ ఇంత వరకూ ఫోన్ రాలేదు. ఇదేమి కంటి వెలుగో అర్థంకావట్లేదు.
- వై.వెంకట్రామయ్య, 6వ డివిజన్, ఖమ్మం