Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణం పనులపై దృష్టి సారించాలి
- మన ఊరు-మన బడి పురోగతి పై కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ-అశ్వారావుపేట
మన ఊరు మన బడి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి నియోజక వర్గంలోని అన్ని పాఠశాలలు పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మన ఊరు-మన బడిలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహణపై పలు సూచనలు చేశారు. దమ్మపేట మండలంలో మరి ఆలస్యంగా పనులు జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 5.81 కోట్లకు బిల్లులు అందగా వాటిలో 5.5 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయనీ, ఇంత వేగంగా బిల్లులు చెల్లిస్తున్న పథకం మన ఊరు-మనబడి మాత్రమేనని అన్నారు. 763 బిల్లులను సమర్పించగా 689 బిల్లుల మంజూరు చేశామని, మిగతా గ్రామీణ ఉపాధి పథకం నిధులతో చెల్లిస్తామని అన్నారు. వాటిని కూడా మరో 3 రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పండుగ వాతావరణంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావాలని, ప్రతి చిన్న పనినీ కూడా శ్రద్ధగా పర్యవేక్షించాలి. సొంత పనులు ఎలా చేసుకుంటామో మనబడి పనులు అలాగే క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాలని అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇచ్చిన మన ఊరు-మన బడి బుక్ లెట్ కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న పనులు పోటోలో ఎక్కువగా ఉన్నాయని, కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందని సంతృప్తి వ్యక్తం చేశాడు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగే పనులపై ఎప్పుడూ సరైన సమీక్ష కూడా జరగలేదని కానీ మన ఊరు-మన బడి పధకంలో పనుల నిర్వహణపై స్వయంగా కలెక్టర్ ప్రత్యేక సమావేశాల నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది అని డీఈఓ సోమశేఖర్ అన్నారు. మన ఊరు-మన బడి పనులు వేగవంతంగా కావటానికి కలెక్టర్ ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈ ఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.