Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురిని అదుపులోకి తీసుకున్న అటవీశాక అధికారులు
నవతెలంగాణ-కొత్తగూడెం
చిరుత పులి చర్మాన్ని విక్రయానికి ప్రయత్నించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖ ఎఫ్డీఓ అప్పయ్య తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం డివిజనల్ ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎఫ్డీఓ అప్పయ్య మాట్లాడుతూ కొత్తగూడెం, ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల వద్ద నుంచి చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 6 నెలల క్రితం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం చింతల్ నార్ అటవీ ప్రాంతంలో ఉచ్చువేసి, ఉచ్చులో చిక్కిన చిరుత పులిని బరిసెలతో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఈ చిరుత పులి చర్మాన్ని కొనుగోలు చేసారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరుకు చెందిన వ్యక్తులు ఈ చర్మాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ చిరుత పులి చర్మాన్ని అమ్మడానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. భద్రాచలానికి చెందిన వ్యక్తుల సహాయంతో కొత్తగూడెం ప్రాంతంలో అమ్మడానికి ప్రయత్నించగా అరెస్టు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎఫ్ఆర్ఓ ఎస్.సురేష్, అధికారులు టి.వెంకటేశ్వర్లు, మస్తాన్‌రావు, లక్ష్మణ్, పిచ్చయ్య, మోహన్, సిబ్బంది లక్పతి, మదన్‌లాల్, సుమన్, సాగర్, మహేష్, సురేష్ పాల్గోన్నారు.