Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో మత్స్య సంపద పెంపుకు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో అధికారులు, ఆక్వా రైతులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆక్వా కల్చర్ జిల్లా స్థాయి సమావేశాన్ని కలెక్టర్ శుక్రవారం నిర్వహించారు. నీలి విప్లవం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సమీకృత మత్స్య అభివృద్ధి పథకంల ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. ఈ పథకాల కింద చేపల చెరువుల నిర్మాణం, చేపల సీడ్ హాచరీలు, చేపల సీడ్ రియరింగ్ యూనిట్ల నిర్మాణం, చేపల కల్చర్‌కు ఇన్ పుట్ కాస్ట్లకు ఎస్సి, ఎస్టీ లకు 60 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో నీలి విప్లవం కింద చేపల సీడ్ రియరింగ్ యూనిట్లకు 32 దరఖాస్తులు, చేపల సీడ్ హాచరీకి ఒకటి, ఆర్ఏఎస్ కి ఒక దరఖాస్తు వచ్చాయన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేప సీడ్ రియరింగ్ యూనిట్ల కోసం 6 దరఖాస్తులు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కోసం కొత్త చేపల చెరువుల నిర్మాణానికి 11, ఆర్ఏఎస్ కి 3, బయో ఫ్లోక్ కి 2 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల పేరుపై భూమికి క్లియర్ టైటిల్ కల్గివుండాలని, లీజుదారుడైతే కనీసం 5 సంవత్సరాల కాలపరిమితి లీజు కల్గివుండాలని సూచించారు. ఆక్వా రైతులకు పథకాలపై అవగాహన కల్పించాలని, వచ్చిన దరఖాస్తుల క్షేత్ర పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా మత్స్య అధికారి ఆంజనేయస్వామి, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా నీటిపారుదల అధికారి వెంకట్రాం, మత్స్య, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఐడిఓసిలో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య, విద్యా, మైన్స్, మైనారిటీ సంక్షేమ, జిల్లా సంక్షేమ, జిల్లా పంచాయతీ అధికారి, పౌరసరఫరాల, కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలను పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటించే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఈ - ఆఫీస్ విధానంలో ఫైల్స్ నిర్వహణ ఉండాలని, భవన సముదాయంలో అన్ని శాఖల ఉద్యోగులు ఐడిఓసిలో ఏర్పాటు చేసిన డ్కెనింగ్ హాల్లోనే భోజనం చేయాలన్నారు. ఐ.డి.ఓ.సిలో ఏర్పాటు చేసిన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్చే కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా ఉద్యోగుల విధి నిర్వహణకు ఇబ్బంది లేకుండా వారి చిన్న పిల్లలను సంరక్షణ కేంద్రం సంరక్షకులకు అప్పగించాలన్నారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.శ్రీనివాసరావు ఉన్నారు.