Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనర్హులను తొలగించాలి...అర్హులకు ఇవ్వాలి
- అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని, జిల్లా కార్యదర్శి కనకయ్య
- అసంపూర్తిగా నిర్మించిన డబుల్ ఇండ్లను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
- ఇండ్లు పూర్తి కాకుండానే లబ్దిదారులను ఎంపిక చేసిన ఘనత ఎమ్మెల్యేకి దక్కుతుంది
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెంలో అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సీపీఐ(ఎం) బృందం సోమవారం సందర్శించింది. ఈ సంధర్భంగా సినీయర్ నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకుండానే లబ్ధిదారుల ఎంపిక ఎలా చేసారని, డ్రా లో తమ పేరు వచ్చిన పేదలు తమకు కేటాయించిన ఇండ్ల మొండి గోడలతో ఉన్నది చూసి ప్రజలు నిరాశతో వెనుదిరిగి పోతున్నారని తెలిపారు. ఈ పాపం స్ధానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌దేనని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం నిర్మాణం అవుతున్న ఇళ్లు పూర్తిగా నాశిరకంగా ఉన్నాయని ఆరోపించారు. సిమెంట్ ఇటుల బిల్లల తయారీలో సిమెంట్‌కు బదులు బుడిద, ఇసుక వాడడం వలన చేతిలోనే సిమెంట్ బిల్లలు పిండిపిండి అవుతున్నాయని, తమ సందర్శంలో ఇది స్పష్టంగా వెళ్లడైనట్లు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపం వలనే ఇంటి నిర్మాణం అసంపూర్తిగా నాసిరకంగా జరుగుతుందన్నారు. తాను అభివృద్ధి ప్రదాత అని నిరంతరం గొప్పలు చెపుకుంటున్న ఎమ్మెల్యేకు ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని తెలియదా..? ఒక వేళ తెలిసే ప్రజలను మోసం చేసారా..? సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇండ్ల నిర్మాణానికి రూ.40 కోట్ల బడ్జెట్లో కేవలం రూ.9 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్‌కు విడుదల చేస్తే ఇండ్ల నిర్మాణం ఎలా పూర్తి అవుతుందన్నారు. ఇది ఇలా ఉండగా ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అధికార పార్టీ కౌన్సిలర్లు తమకు అనుకూలమైన వ్యక్తుల నుండి లక్షలాది రూపాయలు తీసుకుని ఇల్లు కేటాయించారని ఆరోపించారు. జిల్లా అధికారులు నిర్లక్ష్యం, లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగకపోవడం వలన నిజమైన పేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల కేటాయింపులో వార్డు కౌన్సిలర్ల చేతివాటం ప్రదర్శించారని, అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూంలో జరిగిన అవినీతికి ఎమ్మెల్యే పూర్తి భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరిగిందని కలెక్టర్ ప్రకటనలో వాస్తవం లేదని ఆరోపించారు. వార్డు సభలు నిర్వహించకుండా స్థానిక వార్డు పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఎలా పారదర్శకతను ప్రదర్శించారో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు.
పారదర్శకంగా ఎంపిక జరిగితే లబ్ధిదారుల పేరులు ఎందుకు నోటీస్ బోర్డులో ఉంచలేదో చెప్పాలి అన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియ చేయమన్నారు. అసలు డ్రా తీసిన వారి లిస్ట్ బయటికి ఇవ్వకుండా ఎలా తెలియాచేసా ్తరన్నారు. ప్రజల ఆశలు, అవసరాలను కౌన్సిలర్లు, అధికారులు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఇల్లు పూర్తి కాకుండానే డ్రా పేరుతో హడావిడి చేసి ప్రజలను మోసం చేశారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రీ సర్వే చేసి అనర్హులకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని, వార్డు సభలు నిర్వహించి వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కే వరకు ప్రజల తరఫున పోరాడుతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరి లక్ష్మి, బుర్ర వీరభద్రం, జునుమాల వంశీ, నాగకృష్ణ, కుక్కల ముత్తేశ్, మున్ని, వెంకన్న, శివ తదితరులు పాల్గొన్నారు.