Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుఠానీతండాలో ఐదేళ్ల బాలుడిపై దాడి..మృతి
- అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో వీధుల్లో పిల్లలు
- ఒక్క ఫిబ్రవరిలోనే జిల్లాలో 250 కుక్కకాట్లు
- డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇదే తీరు..
- నిర్లక్ష్యం...నియంత్రణ చర్యలు లేని ఫలితమే..!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఉదంతం మరవకముందే ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రఘునాథపాలెం మండలం పుఠానీతండాకు చెందిన బాణోత్ భరత్ (5) అనే ఐదేళ్ల బాలుడు పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. భరత్ తల్లిదండ్రులు సంధ్య, రవీందర్‌కు స్థానికులు సమాచారం అందించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో సూర్యాపేట వద్ద బాలుడు మృతి చెందాడు. వెంటనే స్వస్థలానికి తీసుకువచ్చి సోమవారం మధ్యాహ్నానికి అంత్యక్రియలు నిర్వహించారు. రఘునాథపాలెంలోని మారుమూల తండా కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధికుక్కల కుటుంబ నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లనే ఈ విపరీత ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పుఠానీతండాలో విపరీతంగా కుక్కలు తిరుగుతుండటంతో గ్రామస్తులు సర్పంచ్ భూక్యా బుజ్జికి మొరపెట్టుకున్నారు. పదిరోజుల క్రితం 50 కుక్కలను చంపివేశారు. ఇంకా గ్రామంలో 60 కుక్కల వరకు ఉన్నాయని స్థానికులంటున్నారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేకపోవడం వల్ల పిల్లలు రోడ్ల మీద తిరుగుతుండటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికుల ఆరోపణ. హైదరాబాద్ ఘటన తర్వాత కుక్కకాట్లు నిత్యకృత్యంగా మారాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే రోజుకు పదుల సంఖ్యలో కుక్కకాట్లు నమోదవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని.. ఫలితంగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరంలోనే కుక్కల నియంత్రణ చర్యలు లేవు...మారుమూల తండాల పరిస్థితి ఏంటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
దొంగలు పడ్డ ఆర్నెళ్లకు...
'దొంగలు పడ్డ ఆర్నెళ్లకు...' నానుడి లాగానే అధికారయంత్రంగా చర్యలున్నాయి. ఓవైపు హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకున్నా...పలు గ్రామాల్లో కుక్కకాట్లు పెరుగుతున్నా... ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేకపోవడంతోనే పుఠానీతండా ఉదంతం చోటుచేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. కుక్కల నియంత్రణపై జిల్లా పంచాయతీ అధికారి వీవీ అప్పారావును ప్రశ్నిస్తే...' 16 తేదీ నుంచి పశుసంవర్థకశాఖతో సమన్వయం చేసుకుని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించాం. ఈలోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ చర్యలు చేపట్టాలనుకున్నాం..' అంటూ చెప్పుకొచ్చారు.
- అంగన్వాడీ టీచర్ లేని ఫలితంగానే..
గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో పిల్లల ఆలనాపాలనా చూసేవారు లేరని ఫలితంగానే భరత్‌ను కుక్కలు కరిచి చంపాయని స్థానికులంటున్నారు. కనీసం శాశ్వత అంగన్వాడీ కేంద్రం కూడా లేదని, నాలుగేళ్ల క్రితం అంగన్వాడీ టీచర్‌ను తొలగించినప్పటి నుంచి ఆ ఖాళీని భర్తీ చేయలేదని చెబుతున్నారు. ఈ విషయమై తండా వాసులు సీడీపీవో, కలెక్టర్, ఇతర అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పందన లేదు. కోతులతో వేగలేక గ్రామస్తులు కుక్కలు పెంచుకుంటున్నారు. వాటిని సాకలేక కొందరు వదిలివేస్తున్నారు. ఇటు కుక్కలు, అటు అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారు. అంగన్వాడీ ఆయా ఉన్నా ఆమె పిల్లలు, గర్భిణులకు ఆహారం అందించడం వరకే పరిమితమవుతున్నారు. పిల్లలను కూర్చొబెట్టి విద్యాబుద్ధులు చెప్పించే దిక్కులేక పోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండా వాసులు గగ్గోలు పెడుతున్నారు.
- సంతాన నియంత్రణ లోపాలు...
కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే క్రమంలో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్యాచర్లు ఒక వీధి నుంచి పట్టుకెళ్లిన కుక్కలను తిరిగి అదే బజార్లో వదలట్లేదు. పట్టుకెళ్లిన కుక్కల్లోనూ కొన్నింటికి మాత్రమే సంతాన నియంత్రణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారని...ఆ క్రమంలో వాటిలో కొన్ని తప్పించుకుంటున్నాయని జంతుసంరక్షుకులు అంటున్నారు. ఒక వీధి కుక్క మరో వీధికి రావడంతో వాటిమధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక కుక్క మరో కుక్కను కరవడంతో రాబిస్ ప్రభావం అధికమవుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కుక్కలు పిచ్చి చేష్టలకు దిగుతున్నాయి. ఆ సమయంలో ఎవరు దానికి అందుబాటులోకి వస్తే వారిని కరుస్తున్నాయని జంతుసంరక్షకులు అంటున్నారు. ఆహారాన్వేషణ, ఆడ కుక్కల యద సమయంలో ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని నిపుణుల సూచన. ఆర్నెళ్లకోసారి కుక్కలు యద కొస్తుంటాయని, ఆ సమయంలో మరింత ఉగ్రరూపం దాల్చుతాయని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నగర పాలకసంస్థ పరిధిలో 3,894 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల కుటుంబ నియంత్రణ చర్యలు దాదాపు లేని ఫలితంగానే పుఠానీతండా ఉదంతం చోటుచేసుకుందని స్థానికులంటున్నారు. నాడు హైదరాబాద్ ఉదంతం...నేడు పుఠానీతండా ఘటనలు కుక్కల బెడదపై ఆందోళన కలిగిస్తున్నాయి.
- బాలుని కుటుంబాన్ని ఆదుకోవాలి...
భూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
జిల్లా మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణం. కుక్కల నియంత్రణపై ప్రభుత్వానికి పట్టింపు లేని ఫలితంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ వంటి నగరాల్లోనే కుక్కలు చీల్చిచెండాడుతుంటే...చోద్యం చూస్తున్న ప్రభుత్వం మారుమూల గిరిజన తండాలను పట్టించుకుంటుందనే నమ్మకం లేదు. బాలుని కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి గిరిజనులకు ఇచ్చే మూడు ఎకరాల భూమి ఇవ్వాలి. బాలుని తండ్రి రవీందర్ వికలాంగుడు. ఆయనకు ఏదైనా ఉపాధి మార్గం చూపాలి.