Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-చింతకాని
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా మారిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు వ్యాఖ్యానించారు. గవర్నర్ల రూపంలో కేంద్రం రాష్ట్రాలపై విచ్చలవిడి అధికారాన్ని చలాయిస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు, మీడియా, ప్రశ్నించే గొంతుకులను బిజెపి ప్రభుత్వం నొక్కి వేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 17వ తేదీ నుంచి 29 వరకు జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం చింతకాని సిపిఐ(ఎం) మండల పార్టీ సమావేశంలో పోతినేని మాట్లాడుతూ 17వ తేదీన హనుమకొండ నుంచి మొదలయ్యే యాత్రను పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 రోజులపాటు కొనసాగే ఈ యాత్రలు 29న హైదరాబాద్లో ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్పొరేట్లకు దోచిపెట్టడమే బిజెపి పాలనగా సాగుతుందన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి పదివేల మంది ప్రపంచ సంపన్నుల్లో ఒక్కడిగా ఉన్న గౌతమ్ అదానీ 9 ఏళ్లలో మూడో స్థానానికి చేరాడంటే బీజేపీ ఎంతలా కార్పొరేట్లకు దోచిపెడుతుందో అర్ధం అవుతోంది అన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు బావులు, విద్యుత్తు, రోడ్లు, భూమి, వ్యవసాయం, మార్కెట్లు ఇలా అన్నింటినీ పెట్టుబడుదారులకు ధారా దత్తం చేసే చర్యలను నిరసిస్తూ సిపిఐ (ఎం) జన చైతన్య యాత్రలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రాలపై గవర్నర్ల రూపంలో కేంద్రం విచ్చలవిడి పెత్తనం చెలాయిస్తుందని ఆరోపించారు. రాష్ట్రాల పాలనలో గవర్నర్ల జోక్యం అధికమైందన్నారు. చివరకు ఏ మంత్రులను తొలగించాలో దిశా నిర్దేశం చేసే స్థాయికి గవర్నర్ల పెత్తనం వెళ్ళిందన్నారు. ఈ నెల 19న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి యాత్ర ప్రవేశించి 21 నుంచి 25వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జన చైతన్య యాత్ర- కొనసాగుతుందని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 450 కి.మీ మేర యాత్ర కొనసాగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో 13 కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో సభకు మూడు నుంచి 6000 మంది వరకు హాజరవుతారని తెలిపారు. 23న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో రెడ్ షర్ట్ వాలంటీర్లతో యాత్ర కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో వారం రోజుల పాటు కొనసాగే యాత్ర విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, తోటకూరి వెంకట నర్సయ్య, మద్దిన్ని బసవయ్య, కాట బత్తిన్ని వీరబాబు, గడ్డం రమణ, పులి యజ్ఞనారాయణ, కిరణ్ బాబు, కూచిపూడి బుచ్చిబాబు, నాయకులు గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.