Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి ఆరోపణలతో నిలిచిపోయిన ఇండ్ల పంపిణీ
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. ఆరేండ్లుగా నిర్మాణ దశలోనే నత్త కంటే నెమ్మదిగా సాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఒక భాగం అయితే, కనీసం పూర్తి అయిన ఇండ్లను కూడా పంపిణీ చేయడానికి రాజకీయ నాయకుల పైరవీలు అవినీతి ఆరోపణలతో పేదవాడికి ఇండ్లు అందేనా అన్న ప్రశ్న లేవనెత్తుతుంది. 2016లో అప్పటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో వేగంగా నిర్మించిన 82 డబుల్ బెడ్ రూములను వేగంగా పూర్తి చేసి అన్ని వర్గాల అర్హులైన పేదలకు అందించారు. 2017లో రాజయ్య హయాంలోనే భద్రాచలంలో రెండు ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం 2018 ఎన్నికల తర్వాత నేటి వరకు ఇంటి నిర్మానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పర్యవేక్షించి వేగంగా పూర్తి చేయించాల్సిన ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో నేటికీ అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. కేవలం 117 ఇల్లు మాత్రమే గత నెల చివరికి పూర్తికాగా, వాటిని సైతం పేదవాళ్ళకి పంచే విషయంలో రాజకీయ నాయకుల పైరవీలుకి తోడు అవినీతి ఆరోపణలతో ఐటీడీఏ పీఓనే కల్పించుకొని పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో పంపిణీ ఎలా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మనుబోతుల చెరువు డబుల్ బెడ్ రూమ్‌లకు తమ స్థలాలు ఇచ్చి నిర్వాసితులుగా మిగిలిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ప్రజలు కోరుతుండగా, అప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఆరేండ్లుగా ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా పంపిణీ చేయలేని అధికారులు గోదారి వరద బాధితులకు 1620 ఇండ్లు ఎప్పుడు నిర్మించి ఇస్తారో అని ప్రజలు ఎదురు చూస్తు న్నారు. ఏదేమైనా భద్రాచలం నియోజవర్గంలో పేదవాడి ఇంటికల ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయాలి
డబుల్ ఇండ్ల పంపిణీలో వస్తున్న ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి పేదవాడి దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిని కఠి నంగా శిక్షించాలి. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూములను పూర్తి చేసి అధికారులే సర్వే చేసి. నిజమైన లబ్ధిదారులకి అందించాలి. మణుబోతుల చెరువులో ఇండ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇండ్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
ఎం.బి.నర్సారెడ్డి