Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హామీ
- కల్లూరు ఆర్డిఓ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా
నవతెలంగాణ-కల్లూరు
అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో కల్లూరు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి కోట్ల రూపాయిల డిపాజిట్లను సేకరించి డబ్బులను తిరిగి చెల్లించకుండా డిపాజిట్ దారులను మోసం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను జప్తుచేసి భాదితులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లించింది, కానీ నేటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోలేదని, సంవత్సరం క్రితం అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించినా నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షల మంది ఉన్నారని, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విలువ సుమారుగా రూ.1000 కోట్లు ఉంటుందని, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సింది కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమేనని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కల్లూరు ఆర్డిఓ సూర్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, సమిష్టిగా పోరాడి తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డాక్టర్ మట్టా దయానంద్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఇమ్మనేని ప్రసాదరావు, దొడ్డా శ్రీనివాసరావు, తెలంగాణ అగ్రిగోల్డ్ బాదితుల సంఘం నాయకులు మైలవరపు లక్ష్మీ, రాజకుమారి, పర్సా దుర్గారావు, సయ్యద్ పాషా, చరికుల్లా వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నరసింహా రావు, యనుముల రాము, కుక్కా రాణా, రేపాకుల రామకృష్ణ, ఫకృద్దీన్, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.