Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పంట నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీటి సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో ఎన్ఎస్పి ద్వారా సాగునీటి సరఫరాపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్యాచరణ సమర్పించాలన్నారు. బీబీసీ కింద ఎక్కువగా ఆరుతడి పంటలు ఉన్నట్లు, ఈ పంటలకు ఇప్పటికే నాలుగు నుండి ఐదు తడులకు నీరందించినట్లు తెలిపారు. బోనకల్ మండలం నారాయణపురం, ఆళ్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో పంట పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. నష్ట నివారణకు నీరు విడుదల చేయాలన్నారు. చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెక్టార్ల వారీగా ప్రణాళిక చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ గుర్తించిన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సత్తుపల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాలకు నీరందించినట్లు చెప్పారు. పంట కోతకు వచ్చిన ప్రాంతాలు, ఎంతమేర విస్తీర్ణం పూర్తి వివరాలతో వ్యవసాయ శాఖ నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఈ నివేదికను బట్టి నీటి సరఫరా ఆవశ్యకతను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ ప్రాతంలో పంటలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎక్కడ ఎప్పుడు నీటి అవసరం ఉందో సైంటిఫిక్గా ప్రణాళిక చేపట్టి, పటిష్ట కార్యాచరణ చేయాలన్నారు. రైతులు ఆందోళన చెందకుండా నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, నీటిపారుదల సీఈ శంకర్ నాయక్, ఎస్ఇ లు ఆనంద్ కుమార్, నర్సింగరావు, ఇఇలు శ్రీనివాసాచారి, ఎం.వెంకటేశ్వర్లు, అనన్య, రామకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడీలు తదితరులు పాల్గొన్నారు.