Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించాలి : రైతులు
నవతెలంగాణ - బోనకల్
ధరణి విలువ ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని ఖమ్మం ఆర్డీవో మల్లాది వెంకట రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారమే తమ పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద భూములు కోల్పోతున్న చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి గ్రామాలకు చెందిన బాధిత రైతులతో ప్రత్యేక సమావేశాన్ని అధికారులు గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రవీందర్ నాథ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలకు సంబంధించి భూ క్రయ విక్రయాల ఆధారంగా ధర నిర్ణయించడం జరుగుతుందని, రెండో రకంగా ధరణి విలువ ప్రకారం నష్టపరిహారం నిర్ణయించడం జరుగుతుందని, ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ ధర ప్రకారం మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించటం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా చిన్న బీరవల్లిలో ధరణి విలువ నాలుగున్నర లక్షల ఉందని, పెద్ద బీరవల్లిలో ఆరు లక్షలు ఉందని దాని ప్రకారమే మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. బాధిత రైతు కొనిదన లాలేశ్వరరావు మాట్లాడుతూ తమ భూమి వైరా - మధిర ప్రధాన రహదారి పక్కనే ఉందని, ఆరు నెలల క్రితం 80 లక్షలకు అడిగారని తనకు అతికొద్ది పొలము ఉండటం వల్లనే అమ్ముకోలేదన్నారు. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే కింద తాను భూమి కోల్పోతున్నానని ఈ భూమికి కేవలం 13 లక్షల ఇస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. ఈ రహదారి పక్కన 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బహిరంగ మార్కెట్ ధర ఉందన్నారు. తాము భూములను కోల్పోవటం వలన ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామన్నారు. భూమి కింద భూమి ఇవ్వాలని మరికొందరు రైతులు డిమాండ్ చేశారు. తమ భూమిలో కొంత భాగం మాత్రమే గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి కింద పోతుందని, కొంత భాగం రోడ్డుకి ఇరువైపులా మిగులుతుందని, ఈ మిగులు భూమిని తాము ఏమి చేసుకోవాలని రైతుల ఆయనను నిలదీశారు. రైతులు వెలిబుచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఆర్డిఓ రైతులకు హామీ ఇచ్చారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ రాధిక గుప్తా, ఇన్చార్జి తాసిల్దార్ సంగు శ్వేత, గిర్ధవర్ లక్ష్మణ్, గ్రీన్ ఫీల్డ్ హైవే సైట్ ఇంజనీర్ వెంకట్, ఇరు గ్రామాల బాధిత రైతులు పాల్గొన్నారు.