Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలోని అంగన్వాడి సెంటర్లలో కూడా ఒక్క పూట అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐసిడిఎస్ పిడి సంధ్యకి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.కోటేశ్వరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నింటి రమ్య, కె. సుధారాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒంటి పూట పాఠశాల నిర్వహిస్తున్న సందర్భంగా అంగన్వాడి సెంటర్లలో కూడా ఒక్క పూట పాఠశాల నడుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఒక్కపూట తరువాత ఇంటికి వెళుతున్న సందర్బంగా అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా వారి అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో ఇంటికి వెళుతున్నారని, ఫలితంగా అంగన్వాడి సెంటర్లో పిల్లలు ఒంటి పూట బడులకు అవకాశం కల్పించాలని కోరారు. పిడి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్రావు, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు జి. రామాదేవి తదితరులు పాల్గొన్నారు.