Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంఎల్ఎ కొండపల్లి లక్ష్మినర్సింహారావు (కెఎల్) ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధనలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కొనియాడారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన కె.ఎల్. 12వ వర్థంతి సభ కార్యక్రమం జరిగింది. ఈ వర్థంతి సభలో నున్నా మాట్లాడుతూ తొలితరం కమ్యూనిస్టు యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నామకరణం చేసినవారు, సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించిన వారు, ప్రజాప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధికి అనేక సూచనలు అందజేసినవారు, అనేక నిర్భంధాలను మొక్కవోని విశ్వాసంతో ఎదుర్కొని కేడర్లో ఉత్తేజం నింపిన కె.ఎల్. నిరంతర స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులను పార్టీలో కొనసాగించడంలోనూ, అవకాశం వున్న సౌఖ్య సుఖాలను అనుభవించకుండా కష్టాలను ఎదుర్కొని సమ సమాజ స్థాపన కోసం పాటుబడిన వ్యక్తి కెఎల్ అని పేర్కొన్నారు. ఆయన బాటలో నడవడమే ఆయనకిచ్చే నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి పద్మ, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, దొంగల తిరుపతిరావు, అఫ్రోజ్ సమీనా, పి.రమ్య, ఆర్.ప్రకాష్, టి.లింగయ్య, ఎస్.కె.మీరా, సుదర్శన్, కుటుంబరావు, రమణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.