Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- అధికార పార్టీ ఒత్తిడితో పేదలపైనే కేసులు పెట్టడం దారుణం
- సందర్శనలో అఖిలపక్ష నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
అధికార పార్టీ నేతల అండతో రెవెన్యూ అధికారులు, పోలీసులు పేదల గుడిసెలు తొలగించి, కేసులు పెట్టడం అన్యాయమని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. అధికార పార్టీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై రెవిన్యూ అధికారులు ఒకలా, నిరుపేదలపై మరోలా వివక్షత చూపుతున్నారని అంటున్నారని విమర్శించారు. మండలంలోని బాలాజీ నగర్ పంచాయతీలో పేదల గుడిసెలు తొలగింపు ఘటనపై గురువారం అఖిలపక్ష బృందం పర్యటించింది. బాధితులను కలుసుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు, ఎట్టి హరికృష్ణ, సీపీఐ(ఎం) నాయకులు అబ్దుల్ నబీ, మన్నెం మోహన్ రావు, సీపీఐ నాయకులు బంధం నాగయ్య, దేవరకొండ శంకర్, బీఎస్పీ పార్టీ నాయకులు రాయల శ్రీనివాస్, లేతకుల కాంతారావు, టీడీపీ పార్టీ పుట్టే ఉపేందర్ యాదవ్‌లు మాట్లాడారు. గత రెండు నెలల నుండి ఇల్లు లేని నిరుపేదలు ఇంటి కిరాయిలు కట్టకోలేక సంజరు నగర్ సర్వేనెంబర్ 609లో గల కాళీ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని తెలిపారు. అట్టి గుడిసెలను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా తొలగించారని అన్నారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణం చేపట్టి ఇంటి మీటర్ పొందిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పై ఆంతర్యం ఏమిటోని ప్రశ్నించారు. అమాయకులైన మహిళలపై కేసులు పెడుతూ నోటీసులు పంపిస్తున్నారని ఇది దారుణమన్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుడు అధికారులపై ఒత్తిడి తెస్తూ మరి కొన్ని గుడిసెలు తీయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గుడిసెలు తొలగించిన విషయంపై స్పందించిన అఖిలపక్షం, నిరుపేదలైన ఆదివాసీ గిరిజన ప్రజలకు అండగా ఉంటామని వాళ్లకు ఇంటి స్థలాలు ఇప్పించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజల పక్షానే ఉంటూ పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, జర్రిపోతుల శాంతమ్మ, వంగూరి నాగమ్మ, చీమల విజయ, మౌనిక, నరసింహారావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.