Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి పద్మ
- కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో వీఓఏల టోకెన్ సమ్మె నిరసన
నవతెలంగాణ-పాల్వంచ
ఐకేపీ వీవోఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సీఐటీయూ కోశాధికారి జీలకర్ర పద్మ డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా నూతన కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ధర్నా చౌక్‌లో వీవోఏలను గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం టోకెన్ సమ్మె నిరసన ధర్నా జరిగింది. ఈ సమ్మెను సీఐటీయూ పద్మ వీఓఏలకు పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో వీవోఏలు పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద నిరుపేద మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. వీరికి అన్ని రకాల లోన్స్ ఇప్పించడం, తిరిగి బ్యాంకులకు సక్రమంగా కట్టించడం ఎన్నో కీలకమైన పనులు చేస్తున్న వీరి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. అంతేకాకుండా సంఘాల పుస్తక నిర్వాణ కోసం ఎంపిక చేసిన ప్రభుత్వం ఎన్నో ఆన్లైన్ పనులు పేరుతో ఎస్‌హెచ్‌జి వివో ట్రాన్సాక్షన్స్ ఇలా ఎన్నో ఆన్లైన్ పనులు చేపిస్తున్నారని అన్నారు. వీటితో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకం వీవోఏలకు ముందుండి ప్రజల వద్దకు తీసుకెళుతున్నారని, మరుగుదొడ్లు కట్టించడం, స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్, తడి, పొడి చెత్త, హరితహారం, కంటి వెలుగు, ఇలాంటి అనేక రకాల పథకాలు విజయవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇంత కష్టపడుతున్న కేవలం రూ.3900 మాత్రమే సెర్ఫ్ నుంచి ఇస్తున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఓఏలకు రూ.26 వేల ఇవ్వాలన్నారు.
మహిళా సంఘాలకు బ్యాంక్ వీఎల్ఆర్ శ్రీనిధి నుండి వీఎల్ఆర్ ఇవ్వాలని కోరారు. అభయ హస్తం డబ్బులు అందరికీ తిరిగి ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామ సంఘానికి పక్కా భవనం నిర్మించాలన్నారు. వీవోఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శలు డి.వీరన్న, కె.సత్య, వీవోఏల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనుగోపాల్, ఉపాధ్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి చంద్రలీల, రేష్మ, తదితరులు పాల్గొన్నారు.