Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియల్ ప్లాట్లకు అనుకూలంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కుంచించుకు పోయిన వైనం
- 100 ఎకరాలకు పైగా ఉన్న చివరి భూములకు నీరు అందటం కష్టమే
- ఆందోళన వ్యక్తం చేస్తున్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఆయకట్టు రైతులు
నవతెలంగాణ- సత్తుపల్లి
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తన ప్లాట్లకు అనుకూలంగా ఉండేందుకు పంట పొలాలకు నీరెళ్లకుండా బేతుపల్లి పెద్దచెరువు ఎడమకాలువ పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను మట్టానికళ్లా (ఎడ్జ్) అడ్డుకట్టవేశారు. ఇక ప్లాట్లను అమ్ముకొనేందుకు ఎన్వోసీ ఇవ్వాలంటూ నీటి పారుదల శాఖ అధికారులకు దరఖాస్తు చేసిన వైనమిది. స్థల పరిశీలనకు వచ్చిన ఐబీ అధికారులు సదరు వెంచర్ భూములను, పక్కనున్న రైతుల భూములతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను నిశితంగా పరిశీలించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను రెండు మీటర్ల వరకు వదిలివేయాలని, కెనాల్ మట్టానికల్లా (ఎడ్జ్) వరకు మట్టిపోయరాదని రియల్ వ్యాపారికి తేల్చి చెప్పారు. రియల్ వ్యాపారి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను రెండు మీటర్ల వరకు వదిలి వేయకుంటే దాని పరిధిలో ఉన్న సుమారుగా 100 ఎకరాలకు పైగా ఉన్న చివరి భూములకు నీరు అందని పరిస్థితి ఏర్పడనుంది. అదే గాకుండా నీరు వెళ్లకపోతే పైనున్న భూములు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా చివరి భూములకు నీరెళ్లకుండా అడ్డుకుంటే నీరు అందే పంటపొలాలు మునిగి నీరు అందని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే మూడేండ్ల కిందట కాలువ మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు లాకులు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథాగా పోతోందని రైతులు వాపోతున్నారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు రెండు మీటర్లు వదిలి పనులు చేసుకోవాలి ... వెంకటేశ్వరరావు, ఐబీ ఏఈ,
డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు రెండు మీటర్ల దూరం వదిలి రియల్ పనులు చేసుకోవచ్చు. రైతులు కూడా పిల్లకాలువకు అంచువరకు వచ్చి కంచె వేసుకున్నారు. వాళ్లు కూడా అంతే దూరంలో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే రియల్‌కు ఎన్వోసీ ఇతరత్రా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది, అలా చేయకుండా అనుమతులు ఇవ్వమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం జరుగదు.