Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలోని సుర్దేపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుంచం త్రివేణి(22) హైదరాబాదులోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. వివరాల ప్రకారం స్వప్న లోక్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్లో త్రివేణి అద్దెకు ఉంటూ ఉద్యోగం చేస్తుంది. గురువారం సాయంత్రం అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో త్రివేణి మృతి చెందింది. ప్రమాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన త్రివేణి చదువులో రాణిస్తూ ఇటీవలే హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కూతురు త్రివేణిని బీటెక్ వరకు చదివించారు. తల్లిదండ్రుల కష్టానికి, ఆకాంక్షలకు అనుగుణంగా త్రివేణి పట్టుదలగా చదివి సాఫ్ట్‌వేర్‌లో పైచేయి సాధించింది. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం, అనుభూతులు పొందేలోపే అగ్ని ప్రమాద రూపంలో కూతురు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల కడుపు కోత, మనోవేదన ప్రతి ఒక్కరికి కంటనీరు తెప్పించింది. ఎన్నో కష్టాలు పడి కూతురుని ఉన్నత చదువులు చదివించామని ఉద్యోగం చేస్తూ ఆనందంగా ఉన్న సమయంలో కన్న కూతురు దూరం కావడంతో త్రివేణి తల్లిదండ్రులు రామారావు రమణమ్మ రోదనలు ఆపడం ఎవరి తరమూ కాలేదు. తమతో కలిసిమెలిసి సరదాగా ఉండే త్రివేణి మృతి చెందడంతో స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.