Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజులుగా గాలి వానలు, అకాల వర్షాలకు, జిల్లాలో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మొక్కజొన్న, మిరప, వరి, మామిడి పంటలు వేసిన రైతులు బాగా నష్టపోయారన్నారు. ఆరు గాలం కష్టపడి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పంటలు పండి చేతికి వచ్చే సమయాన కురిసిన అకాల వర్షాల వలన రైతులు కోలుకోని విధంగా నష్టపోయారని, పంటల కోసం తెచ్చిన అప్పులు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు భరోసా కలిగించేలా నష్టపరిహారంపై ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తుఫాన్‌తో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి
మధిర : అకాల వర్షం చేత నష్టపోయిన మొక్కజొన్న రైతులను, మామిడి, రైతులను వరి, మునగ రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మందా సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర మండలంలో పరిధిలో పలు గ్రామాలలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించటం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శీలం నరసింహారావు, పడకంటి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తేలపోలు రాధాకృష్ణ, యువజన విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్, వడ్రానపు మధు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటలను పరిశీలించిన అధికారులు
ముదిగొండ : మండలంలో గురువారం రాత్రి అకాలంగా ఈదురుగాలులతో కురిసిన వర్షంకు వివిధ గ్రామాల్లో చేతికందే దశలో మొక్కజొన్న నేలవాలిపోయి నష్టం కలిగింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మండల పరిధిలో న్యూలక్ష్మీపురం, చిరుమర్రి, వనంవారి కిష్టాపురం, ముత్తారం, కమలాపురం, బాణాపురం గ్రామాలలో వ్యవసాయ అధికారి ఏవో మందుల రాధ దెబ్బ తిన్న మొక్కజొన్న పంటలను శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 3,400 ఎకరాల మొక్కజొన్న ఈదురు గాలులతో కురిసిన అకాలవర్షానికి భూమిపైన వాలిపోయిం దన్నారు. మండలంలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మౌనిక, బత్తుల నవీన్, వంశీ, దివ్యమనిషా, ఇందు భవాని,పలువురు రైతులు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటను పరిశీలించిన రైతు సంఘం నాయకులు
ఈదురుగాలులతో అకాలంగా కురిసిన వర్షానికి మండలపరిధిలో వెంకటాపురం గ్రామంలో నేలవాలిన మొక్కజొన్న పంటను శుక్రవారం క్షేత్రస్థాయిలో సిపిఐ (ఎం), రైతు సంఘం నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం మాట్లాడుతూ అకాలవర్షంకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, నాయకులు మేడా నారాయణ, చావా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు
ఖమ్మంరూరల్ : అకాల వర్షానికి చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. మండలంలోని గుదిమళ్లలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతిన్నది.ఇక్కడ రైతులు రెండో పంటగా మొక్కజొన్నను ఎక్కువగా సాగుచేస్తుంటారు. సాగవుతున్న పంటలో చాలా వరకు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ఏఈవో వెంకటేశ్ శుక్రవారం దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపునన్నుట్లు ఏవో నాగేశ్వరరావు తెలిపారు.
పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతి
తిరుమలాయపాలెం : పిడుగుపాటుకు గురై 8 గొర్రెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఎర్రగడ్డలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన కూరపాటి పుల్లయ్య, శాంతినగర్‌కు చెందిన గోపి దేశి లక్ష్మణ్ గత రెండు నెలల క్రితం నుండి తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో గొర్రెలు మేకలను మేపుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అకస్మాతుగా ఉరుములు మెరుపులతో పిడుగు గొర్రెల మందపై పడటంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంఎల్ఏ
వైరా : వైరా మండలంలో గురువారం గాలి వాన బీభత్సం వల్ల దెబ్బతిన్న మొక్క జొన్న పంటను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ విజయనిర్మల ఇతర అధికారులతో కలిసి వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పరిశీలిం చారు. ఖానాపురం గ్రామంలో నేలకొరిగిన పలువురు రైతుల మొక్క జొన్న పంటలను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయ అధికారులు జెడి శ్రీమతి విజయనిర్మల ఏడిఏ బాబురావు ఏవో పవన్ కుమార్ వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికి రత్నం జడ్పిటిసి నంబూరి కనకదుర్గ జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్ మహమ్మద్ లతో కలిసి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అకాల వర్షాలు గాలికి దెబ్బతిన్న పంట నష్టాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి సంబంధిత రైతులకు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
చిన్న వర్షానికి వీధులు జలమయం
రఘునాథపాలెం : మండల పరిధిలోని పుటాని తండా గ్రామపంచాయతీలో శుక్రవారం ఉదయం తెల్లవారు జామున కురిసిన వర్షానికి వీధులు జలమయమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఇటీవల సిసి రోడ్లు వేసినందున ఆ సీసీ రోడ్లు ఎత్తు కావడంతో, వీధుల్లోనూ, ఇంటిలోనూ వర్షపు నీరు నిల్వ అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆ నిర్మించిన సిసి రోడ్లు, ఎత్తు భాగం అయినందున, ఇటీవల కాలంలో నిర్మించిన రోడ్డు దిగువున ఉండటంతో ఆ వర్షపు నీరు నిల్వగా ఉండి పోతుందని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక చొరవ చూపి, గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
మధిర : అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతుసంఘం(ఏఐకేఎస్)జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మందడపు రాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో మండలంలో మల్లవరం, రామచంద్రపురం, జాలిముడి, రొంపిమల్ల తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న, పెసర పంటలను మధిర వ్యవసాయ అధికారి డీఎన్ కె.శ్రీనివాసరావుతో కలిసి రైతుసంఘం నాయకుల బృందం శుక్రవారం పరిశీలించింది. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.