Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కజొన్న కంకులు కోయకండి
- పంటల పరిశీలనలో వ్యవసాయ శాఖ ఏఓ సతీష్
నవతెలంగాణ-ఇల్లందు
వేకువ జామున పట్టణంలో భారీ వర్షం కురిసింది. మండలంలో మామూలు వర్షం పడింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారి శుక్రవారం మండలంలోని అనేక గ్రామాల్లో మొక్కజొన్న, వరి, మామిడి తోటలను పరిశీలించారు. రైతులను కలుసుకొని సూచనలు చేశారు. అనంతరం మాట్లాడారు. గురు, శుక్రవారం కురిసిన వర్షానికి పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. నాలుగు రోజుల్లో అకాల వర్షాలు పడనున్నాయని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏఓ సతీష్ కోరారు. యాసంగి(రబీ)లో రైతులు మొక్కజొన్న 12 వేల ఎకరాల్లో వేశారని పంట కోతకు వచ్చిందని అన్నారు. వాయుగుండం, అకాల వర్షాలు ఉన్నందున కంకులు కొయవద్దన్నారు. వరి 12ఎకరాల్లో సాగుతోందని పిలకలు వేసే దశలో ఉన్నందున వర్షాలు ఉపయోగకరమే అన్నారు. 300 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అక్కడక్కడ పిందె దశలో ఉండటంవల్ల నష్టమేమీ లేదన్నారు. గాలి దుమారాలు వస్తే నష్టం ఉంటుందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మిర్చి కల్లాలు దాదాపు ఎక్కడా లేవని, ఒకటీ రెండు చోట్ల ఉంటే పట్టాలు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఇల్లందు పట్టణంలో భారీ వర్షం
వాయుగుండం ప్రభావంతో గ్రామాల్లో గురువారం 6 మిమి వర్షం పడగా శుక్రవారం ఉదయం 8 గంటలకే పట్టణంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. మండలంలో అనేక గ్రామాల్లో మామూలు వర్షం పడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగింది. ఒక్క పూట బడులు కావడంతో పాఠశాలకు వెళ్లడానికి పిల్లలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో కొన్ని చోట్ల పాఠశాలలు తెరచుకోలేదు.