Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.240 కోట్లతో పరిశ్రమలు నిర్మాణం
- ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-అశ్వారావుపేట
సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు జారీ చేయనుందని, అట్టి భూములకు సైతం ఆయిల్ ఫాం మొక్కలు అందించనున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. సాగునీటి సౌకర్యం ఉన్న ప్రతి ఎకరాకు మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ ఫెడ్ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో సాగు లక్ష్యం మార్చి నెలాఖరు నాటికి 45 వేల ఎకరాలు పూర్తి కానుందని వివరించారు. మిగతా 13 జిల్లాల్లో ప్రయివేట్ కంపెనీలు 33 వేల ఎకరాల్లో మాత్రమే సాగును విస్తరించాయని, కానీ ప్రయివేట్ కంపెనీలకు కంటే ఆయిల్‌ఫెడ్ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా 40 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు విస్తరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఇందుకు అవసరమైన 25.85 లక్షల మొక్కలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త సాగు విస్తీర్ణం దృష్ట్యా భవిష్యత్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పరిశ్రమల సామార్థ్యాలను పెంచుతున్నామని అన్నారు. అశ్వారావుపేట కర్మాగారాన్ని 30 నుండి 60 టన్నులు, అప్పారావుపేట ఫ్యాక్టరీకి 60 నుండి 90 టన్నుల సామార్థ్యాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను అశ్వారావుపేటకు రూ.150 కోట్లు, అప్పారావుపేట ఫ్యాక్టరీకి రూ.30 కోట్లు చొప్పున. కేటాయిస్తున్నామని అన్నారు. అలాగే సిద్ధిపేట, బీచుపల్లిలో వచ్చే ఏడాది రూ.320 కోట్లతో రెండు కొత్త ఫ్యాక్టరీలను నిర్మిస్తామని తెలిపారు. ఆయిల్‌లకు కనీస మద్దతు ధర ప్రకటించటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కనీసం టన్ను ఆయిల్ ఫాం గెలలు ధర రూ.18 వేలు ఉండాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయిల్‌కు కనీస మద్దతు ఉంటే రైతుల ప్రయోజనాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికతోనే ఆయిల్ ఫాం మొక్కల కొరతను అధిగమించామని, ఇకపై దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు మొక్కలు పంపిణీ చేస్తామని, గతంలో ఏళ్ళ తరబడి మొక్కల కోసం రైతులు పడిగాపులు పడాల్సిన అవసరం చెప్పారు. అనంతరం నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. మొక్కల నాణ్యతలో రాజీ ఉండొద్దని స్థానిక అధికారులను ఆదేశించారు. అక్కడ నుండి ఆయిల్‌ఫెడ్ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టును సూచించారు. ఆయన వెంట డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్ గౌడ్, నాగబాబు, ఏఈ సిద్దార్థ్, ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాకృష్ణ, అప్పారావు, అశోక్, తదితరులు ఉన్నారు.