Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 450 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి
- 700 మిలియన్ యూనిట్లకు చేరనున్న సింగరేణి సోలార్ పవర్
- సంస్థ చైర్మెన్, ఎం.డి.ఎన్.శ్రీధర్
నవతెలంగాణ-ఇల్లందు
2024వ సంవత్సరానికల్లా సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్‌కు సమానంగా సోలార్ విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేస్తూ ''నెట్ జీరో'' ఎనర్జీ సంస్థగా అవతరించనున్నది. ఈ మేరకు సంస్థ ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతోందని, విద్యుత్తుకు సమానంగా 700 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ సరి కొత్త మైలురాయిని చేరుకోనుందని సంస్థ చైర్మన్, ఎం.డి. ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు శుక్రవారం న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన దేశవ్యాప్త బొగ్గు కంపెనీల సమీక్ష సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ తన 42 గనులు, దాదాపు 43 వేల మంది కార్మికుల కాలనీల అవసరాల కోసం ప్రతి ఏడాది 700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో నుండి కొనుగోలు చేస్తూ వినియోగిస్తుందని, ఈ విద్యుత్ ఖర్చులను పూర్తిస్థాయిలో తగ్గించుకోవడం కోసం సింగరేణిలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పెద్ద ఎత్తున నెలకొల్పడం జరుగుతుందన్నారు. మొదటి దశలో నిర్దేశించుకున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో ఇంకా మిగిలి ఉన్న 76 మెగావాట్ల ప్లాంట్లను ఈ ఏడాది జూన్ చివరికల్లా పూర్తి చేయనున్నామని, తద్వారా మరో 120 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తుందన్నారు. తమ రెండవ దశలో భాగంగా మరో 150 మెగా వాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను భూపాలపల్లి, మందమర్రి తదితర ఏరియాల్లో మరో ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వీటి నుండి మరో 230 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ ప్లాంట్లు 2024 నాటికి పూర్తవుతాయని, తద్వారా సింగరేణి సంస్థ తన విద్యుత్ అవసరాలకు తగిన విధంగా 700 మిలియన్ యూనిట్ల వార్షిక సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. ఈ వివరాలను ఎన్.శ్రీధర్ సమీక్ష సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణ రావు, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, సింగరేణి సోలార్, థర్మల్ పవర్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.