Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీ మేరెడ్డి వసంత
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మిదేవిపల్లి మండలం, కూనారం గ్రామ శివారు లోని సర్వే నెంబరు 13లో ఉన్న 4546 ఎకరాల17 కుంటలలో ఫారెస్టు గెజిట్-ప్రకారం ఫారెస్టుకు 4064 ఎకరాల 17 కుంటలు ఇచ్చారని, మిగిలిన 500 ఎకరాల రెవెన్యూ భూమికి ఫారెస్టు భూమికి రెవెన్యూ మ్యాపులో సబ్-డివిజన్ చేయబడలేదని, ఫారెస్టు మ్యాపు ప్రకారం సబ్-డివిజన్ చేసి హద్దులు నిర్ణయించి రైతులకు అందజేయాలని లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీ మేరెడ్డి వసంత ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడారు. లక్ష్మిదేవిపల్లి మండలంలోని కూనారం రెవెన్యూలో సేత్వార్ పహణి ప్రకారం 13 సర్వే నెంబరులో 4546 ఎకరాల17 కుంటల భూమి ఉందని చెప్పారు. దానిలో 4064 ఎకరాల 17 కుంటల ఫారెస్టు గెజిట్-1 ప్రకారం ఫారెస్టు వారికి ఇవ్వబడిందిని చెప్పారు. మిగిలిన 500 ఎకరాల భూమిలో 250 ఎకరాల అంబసత్రం భూమి పోగా మిగిలిన 250 ఎకరాలలో స్థానిక ఆదివాసీ పేద గిరిజన రైతులు దాదాపు 50 కుటుంబాల వారు 150 ఎకరాల భూమిని సాగు చేసుకుంటుండగా, అట్టి రైతులను భూమి నుండి వెళ్ళగొట్టి ఈ మిగులు రెవెన్యూ భూమి కూడా తమదేనని ఫారెస్టు వాళ్ళు ఆక్రమించారు. గత 6 సంవత్సరాలుగా భూములను సాగు చేయనీయడం లేదని తెలిపారు. కటిక పేదలైన ఆదివాసి గిరిజనులు దిక్కులేక రోజు కూలి పై ఆధారపడి పూట వెల్లదీసుకుంటున్నారు. ఇట్టి భూమికి సంబంధించి ఫారెస్టు రెవెన్యూ భూములకు మధ్య హద్దులు నిర్ణయించి ఫారెస్టు వారు ఆక్రమించిన రెవెన్యూ మిగులు భూమిని వేరు చేసి భూమిలేని ఆదివాసి పెదగిరిజన రైతులకు పట్టాలు యిప్పించి ఆదుకోవాలని కోరారు.