Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లిందనే చెపప్పవచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పుతో మండలంలో గురువారం సాయంత్రం నుండి గాలులతో కూడిన చిరు జల్లులు కురవగా శుక్రవారం ఉదయం నుండి మోస్తరు భారీ వర్షపాతం నమోదు అయింది. ఆకాల వర్షాల మూలంగా మండలంలోని పర్ణశాల, బైరాగులపాడు, సున్నంబట్టి, దుమ్ముగూడెం, సీతారాంపురం, నర్సాపురం, తూరుబాక, బండారు గూడెం, రామారావు పేట గ్రామాలతో పాటు పలు చోట్ల మిర్చి కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోగా అధిక వర్షాలకు కోత దశలో ఉన్న మిర్చి నేల రాలింది. ఈ ఏడాది మిర్చికి మంచి రేటు ఉంది అనుకుంటున్న తరుణంలో మిర్చి కల్లాల్లో ఆరబోసిన మిర్చితో పాటు కోత దశలో ఉన్న మిర్చి నేల రాలి, నల్లబారి పోవడం వలన మార్కెట్ ప్రకారం ధర రాదేమోనని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
గగ్గోలు పెడుతున్న వరి సీడ్ రైతులు : మండలంలోని పర్ణశాల, సీతానగరం, ఎస్ కొత్తగూడెం, కాశీనగరం, సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాలలో సుమారు వెయ్యి ఎకరాలలో కమర్షియల్ వరి సీడ్‌తో పాటు బేయర్, సిజెంటా వరి సాగు చేశారు. వరి చేలు పొట్ట దశలో ఉండటం వలన సుంకు రాలి పోవడంతో పాటు గింజ నల్లబారి పోతుందని రైతులు తెలుపుతున్నారు. దీని వలన రైతులు ఆరుగాలం కష్టించి పెట్టిన పెట్టుబడి రాక పోగా తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి ఉందని రైతు రామ్‌లాల్ రాజు నవతెలంగాణ ముందు వాపోయారు.
అన్నదాతకు తీరని నష్టమే : వాతావరణ మార్పులతో గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టమే వాటిల్లిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మిర్చి, వరి సీడ్ పంటలకు వాతావరణం అనూకూలంగా ఉందని రైతులు ఎంతో ఆశతో ఉన్న సమయంలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది.