Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్యంకు బీజేపీ బడా మోసం
- దగా పడ్డ భద్రాద్రికి సీపీఐ(ఎం) భరోసా
- భద్రాచలంకు నేడు జన చైతన్య యాత్ర
- అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ
- హాజరు కానున్న రాష్ట్ర నేతలు
నవతెలంగాణ-భద్రాచలం
పేరుకే రామజపం...రాముని కోవెలకు తీరని అన్యాయం. పుణ్యక్షేత్రాన్ని కాపాడమని వేడుకున్న నిష్ప్రయోజనం. విశాల మన్యాన్ని ముక్కలు ముక్కలు చేసేసారు. అభివృద్ధి మాట మరచి అన్యాయం చేశారు. భద్రాద్రి బంగారు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వంపై స్థానికులు గుర్రు మంటున్నారు. భద్రాద్రి ప్రజల గోడును పట్టించుకున్న వారే లేకుండా పోయారు. అనేక విపత్కర పరిస్థితుల్లో ఏజెన్సీ వాసులకు వెన్నుదన్నుగా ఉన్న సీపీఐ(ఎం0 మరో భద్రాచలం ప్రజలను చైతన్యవంతం చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎర్రజెండా నేతలు కదం తొక్కునున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం భద్రాచలం మన్యంలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర భద్రాచలం పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టనుంది. బహిరంగ సభ ద్వారా... కేంద్రానికి స్థానికుల ఆకాంక్షను తెలపనుంది. ఇకనైనా పుణ్యక్షేత్ర ప్రగతి చేపట్టకపోతే బిజెపి ప్రభుత్వా నికి పుట్టగతులు ఉండవన్న సంకేతాలు, హెచ్చరి కలు ఈ చైతన్య యాత్ర ద్వారా చేరనున్నాయి.
మన్యానికి బీజేపీ బడా మోసం
ఒకనాడు భద్రాచలం ఏజెన్సీ విశాల ప్రాంతంతో అలరారుతూ ఉండేది. పోలవరం అంశం తెరపైకి వచ్చాక వినాశనం వికృత చేష్టలకు దారితీసింది. భద్రాచలం రూపురేఖలే కోల్పోయింది. పాలకులకు ముందు చూపు కొరవడటమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ తన తొలి సంతకాన్ని భద్రాచలం విభజన పైనే పెట్టటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఏడు మండలాలను ప్రత్యేక ఆర్డినెన్స్ పేరుతో ఏపీలో కలిపి భద్రాచలం నియోజకవర్గాన్ని ముక్కలు చేయడం జరిగింది. అక్కడినుంచి భద్రాచలం మన్యం వినాశనం ఆరంభమైంది. నిత్యం రామ జపం చేసే బీజేపీ రాముడు కొలువై ఉన్న దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. అడ్డగోలు విభజనతో ఆంధ్రాలో కలిపిన 5 గ్రామపంచాయతీలు నైనా సరే భద్రాచలంకు ఇచ్చి పుణ్యక్షేత్ర వైభవంకు కాసింతైనా మేలు చేయాలని ఇక్కడి రామభక్తులు, స్థానికులు నెత్తి, నోరు కొట్టుకొని నినదించినా ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పాండురంగాపురం-సారపాక రైల్వే లైను ఏర్పాటుకు ఆనాటి భద్రాచలం సీపీఐ(ఎం) పార్లమెంటు సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు కృషి ఫలితంగా రైల్వే లైన్ సర్వే జరిగినప్పటికీ, నేటికీ నిధులు మంజూరు లేక రామ భక్తుల చిరకాల వాంఛ రైల్వే లైన్ నిర్మాణం అమలుకు నోచుకోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామాయణం సర్క్యూట్లో భద్రాచలంకు స్థానం లేకపోవడం శోచనీయం. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా జలమయం అయ్యే అవకాశం ఉందని ఇటీవల వచ్చిన వరదలు రుజువు చేశాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది. భద్రాచలం పట్టణంలో ఉన్న కరకట్ట ఎత్తు పెంచి, ఈ రామ క్షేత్రాన్ని కాపాడాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కేంద్రంలోని బిజెపి ఎక్కడా ముందడుగు వేసిన పరిస్థితి కనిపించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ పేదలతో ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరపలేదు. ఇటీవల వచ్చిన వరదలు భద్రాచలం పట్టణ ప్రజలను కునుకు నిద్ర లేకుండా చేశాయి. ఒకానొక దశలో భద్రాచలం పట్టణమంతా మునిగిపోయే పరిస్థితులు దాపురించాయి.
దగాపడ్డ భద్రాద్రికి సీపీఐ(ఎం) భరోసా
భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధిలో ఎర్రజెండా ఆది నుంచి పావులు కదుపుతూ వస్తూనే ఉంది. ఇక్కడ పనిచేసిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజల పక్షాన నిలబడి వారికి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. అనేక విపత్కర పరిస్థితుల్లో కూడా సీపీఐ(ఎం) స్థానికులకు రక్షణ కవచంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న నినాదాన్ని తొలుత పార్టీనే భుజాన వేసుకుంది. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ముంపు మండలాలను తెలంగాణకు కేటాయించాలని నినదించింది. భద్రాచలం పట్టణాన్ని రక్షించాలని, కరకట్టలు ఎత్తు పెంచాలని డిమాండ్ చేసింది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ శ్రేణులు పోరాటాలు నిర్వహించారు. మరోమారు సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర పేరుతో ఏజెన్సీ వాసులను జాగృతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గంలో జన చైతన్య యాత్ర ప్రారంభం కాగా... సోమవారం భద్రాచలం పుణ్యక్షేత్రంలోకి ఈ యాత్ర చేరుకోనుంది. కన్నాయిగూడెంలో జన చైతన్య యాత్ర బృందంకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు భద్రాచలం పార్టీ శ్రేణులు సమాయ త్తమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాయి. కరపత్రాలు, వాలు పోస్టర్ల ద్వారా ప్రచారం జరిపారు. భద్రాచలం పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. ఈ మహాసభకు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, రాష్ట్ర, జిల్లా నేతలు హాజరు కానున్నారు. భద్రాద్రికి బిజెపి చేసిన అన్యాయంపై వారు గళం విప్పనున్నారు. ఈ ప్రాంత వాసుల మనోగతాన్ని బిజెపి ప్రభుత్వానికి తెలిపి, ఇకనైనా పుణ్యక్షేత్ర అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే బిజెపి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్న హెచ్చరికలు జారీ చేయనున్నారు. భద్రాచలంలో సోమవారం సాయంత్రం నిర్వహించే సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.