Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగు పాటుకు 12 పశువులు మృతి
- పలువురి రైతుల పంట నష్టం
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో మండలంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. కిన్నెరసాని, జల్లేరు వాగులు వరదలు పారాయి. చెరువులు, కుంటలు మోస్తరుగా నిండాయి. సింగారం గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు పాయం లక్ష్మయ్యకు చెందిన రెండు దుక్కిటెద్దులు, ఒక దూడ, కొమరం రాంబాబుకు చెందిన రెండు దుక్కిటెద్దులు, తోలెం నరసింహారావుకు చెందిన రెండు దుక్కిటెద్దులు శనివారం రాత్రి పందిరిపై పిడుగుపడి, పందిరి కింద ఉన్న 6 దుక్కిటెద్దులు, దూడ మృతి చెందాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ.190000 ఉంటుందని స్థానికులు అంచనా వేశారు. అలాగే మర్కోడు గ్రామ పంచాయతీ సంధిబంధం గ్రామంలో పాడి రైతులైన బొమ్మల లక్ష్మయ్యకి చెందిన 3 ఆవులు, ఈసం సత్యంకు చెందిన ఒక ఆవు, బొమ్మల ఆంజనేయులుకు చెందిన ఒక ఆవు అర్ధరాత్రి పిడుగు పాటుకు మృతి చెందాయి. 5 గోవుల విలువ సుమారు రూ.250000 ఉంటుందని పలువురు స్థానిక రైతులు తెలిపారు. దాంతో రెండు గ్రామాల్లోని బాధిత ముగ్గురు వ్యవసాయం, ముగ్గురు పాడి రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. రెండు గ్రామాల బాధిత పాడి రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అర్ధరాత్రి దాటాక పడిన భారీ వర్షానికి ఆళ్ళపల్లి, మైలారం, జిన్నెలగూడెం, తదితర గ్రామాలకు చెందిన రైతుల మొక్కజొన్న చేలు నేల వాలాయి. జిన్నెలగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన సమ్మయ్య మామిడి తోటలో కాయలు, పూత పూర్తిగా నేల రాలాయి. మరోపక్క మండల పరిధిలోని రాయిగూడెం గ్రామస్తులు దారిన రాకపోకలు సాగించేందుకు మద్యన ఉన్న పైపు కల్వర్టు పై గ్రావెల్ పోసేందుకు ఇటీవల కాలంలో తలా ఇంత డబ్బులు వేసుకుని కల్వర్టు పై గ్రావెల్ పోశారు. కానీ, అకాల వర్షం వల్ల వొర్రెలో వరద భారీగా పారడంతో పైపు కల్వర్టు పై ఉన్న గ్రావెల్ పూర్తిగా పోయింది. దాంతో గ్రామస్తులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇకనైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని రాయిగూడెం గ్రామానికి వంతెన ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ముక్త కంఠంతో గ్రామస్తులు వేడుకుంటున్నారు. దాంతో పాటు శనివారం రాత్రి వర్షంతో పాటు వేగంగా వీచిన గాలికి రాయిపాడు గ్రామంలోని వూకె కుమార్ అనే వ్యక్తి ఇంటి రేకులు పగిలి, ఇంట్లో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతని ఇంట్లో ఉన్న స్టూడియో పరికరాలు కొంత నష్టం, కొంత ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయారు.