Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతింటి కలను సాకారం చేసిన బాల్య స్నేహితులు
నవతెలంగాణ- సత్తుపల్లి
ఆ మిత్రులతో స్నేహం తనకు గూడు కట్టించి ఇస్తుందని ఆ మిత్రుడు ఎప్పుడూ కల కనలేదు. కలిసి చదువుకున్న ఆ మిత్రులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాని వారిలో ఓ మిత్రుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని, కనీసం ఉండటానికి ఇల్లు లేదని తెలుసుకున్న ఆ మిత్రులు చలించిపోయారు. అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అందరం కలిసి మిత్రునికి ఇల్లు కట్టించి ఇద్దామని తీర్మానించుకున్నారు. ఇతర దేశాల్లో స్థిరపడిన మిత్రుల సహకారంతో ఇంటి నిర్మాణాన్ని రెండు నెలల వ్యవధిలో పూర్తిచేసి ఆదివారం మిత్రుని కుటుంబాన్ని గృహ ప్రవేశం చేయించారు. విరాల్లోకి వెళ్తే...సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేటకు చెందిన జల్లిపల్లి రాంబాబు ఏన్కూరు గురుకుల పాఠశాలలో 1994లో పదో తరగతి 'బి' సెక్షన్లో విద్యను అభ్యసించాడు. తనతో చదువుతున్న మిత్రులతో స్నేహంగా ఉండేవాడు. అక్కడ విద్యాభ్యాసం అయిపోగానే మిత్రులంతా తలాదిక్కుకు పోయిన విద్యను అభ్యసించి స్థిరపడ్డారు. రాంబాబు మాత్రం ఆర్థికంగా వెనుకబడి ఉండటమే గాక సొంతిల్లు కూడా ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిన ఏన్కూరు గురుకులం మిత్రబృందం కేవీ రాంబాబు, కిన్నెర ఆనందరావు, పీవీ సుబ్బారావు, ఎస్.శ్రీనివాసరావు, సి.హెచ్.శంకర్, ఎం.సంపత్‌కుమార్, ఎస్. కుటుంబరావు కూడబలుక్కొని రాంబాబును ఓ ఇంటివాడిని చేయాలని ఆలోచన రావడమే తరువాయి అన్నట్టుగా ఇతర దేశాల్లో ఉన్న మిత్రుల సహకారంతో రెండు నెలల వ్యవధిలోనే ఫ్లైయాస్ బ్రిక్సు, సిమెంట్ రేకులతో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఆదివారం రాంబాబు దంపతులకు నూతన వస్త్రాలు అందించి గృహ ప్రవేశం చేయించారు. ఆపదలో ఉన్న మిత్రుడికి మిత్రులు ఇల్లు కట్టించి ఇవ్వడంపై ఆ మిత్రులను పలువురు అభినందించడమే గాక వీరిని ఆదర్శంగా తీసుకొని ఆపదలో ఉన్న మిత్రులకు సాయపడాలని సూచిస్తున్నారు.