Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని వీరభద్రం, పోట్ల రంగారావు, నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఆదర్శ కమ్యూనిస్టు, అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు మార్గంలో నడవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. పిండిప్రోలు గ్రామ సర్పంచ్ అయిన రాయల నాగేశ్వరరావు సంస్మరణ సభ ఆదివారం హై స్కూలు గ్రౌండ్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శి కమ్మ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు తమ్మినేని హాజరై రాయల నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించి, చిత్రపటానికి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. గ్రామ మంచినీటి సమస్య పరిష్కారానికి ఊర చెరువు నుంచి ఎంతో కష్టపడి పైప్ లైన్ వేశారని గుర్తు చేశారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోట్ల రంగారావు ప్రసంగిస్తూ రాయల నాగేశ్వరరావు ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధిగా 1981 నుండి ఇప్పటివరకు మూడు సార్లు సర్పంచిగా, ఒకసారి ఎంపీటీసీగా పనిచేశారని అన్నారు. కేస్వపురం, పాపాయిగూడెం, బీచ్ రాజు పల్లి, వేదుల చెరువు దమ్మాయిగూడెం గ్రామాలలో కూడా పార్టీ అభివృద్ధికి కషి చేశారని అన్నారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు ప్రసంగిస్తూ గ్రామంలో మంచినీటి సమస్య ఏర్పడినప్పుడు రాయల కోరిన వెంటనే నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా నీళ్లను అందించినట్లు చెప్పారు. గ్రామంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఉంటే పూర్తి చేయడానికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగిస్తూ కరువు మండలంగా ఉన్న తిరుమలాయపాలెం మండలాన్ని పాలేరు రిజర్వాయర్ లిఫ్ట్ ద్వారా భక్త రామదాసు పైప్ లైన్ ద్వారా నీళ్లను అందించి ప్రజల ఇబ్బందులను తీర్చడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సంభాని చంద్రశేఖర్ ప్రసంగిస్తూ, రాయల నాగేశ్వరరావు నిస్వార్థ జీవని, ప్రజల కోసం పరితపించారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో పాటు పడ్డారని అన్నారు. ఈ సంస్మరణ సభలో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అక్కిన వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ తాత మధు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ప్రజా పంథా పార్టీ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, మమతా జనరల్ హాస్పిటల్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కె జగదీష్ కుమార్, ప్రముఖ డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం, రాష్ట్ర అధ్యక్షులురాయల చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు పాడిన విప్లవ గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.