Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత 15 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టండి
- సర్వసభ్యుల సమావేశంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అప్జల్ హాసన్
నవతెలంగాణ- ఖమ్మం
టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలోనే హౌసింగ్ సొసైటీ కొనసాగాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హాసన్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఖమ్మం జిల్లా హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలకు ఇకనైనా తెరదింపాలని హౌసింగ్ సొసైటీ సభ్యులను కోరారు. సొసైటీ సభ్యులు మాట్లాడుతూ సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా, సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి ఏడాది కూడా సర్వీస్ లేని వారికి యూనిఫామ్ సర్వీస్, ప్రభుత్వ ఉద్యోగులు కానివారికి ప్రస్తుతం ఉన్న సొసైటీ ప్లాట్లు కేటాయించిందన్నారు. ఇన్ని రోజులు, ఈ అక్రమాలు తమ దృష్టికి వచ్చినా తాము ఏమి చేయలేని పరిస్థితుల్లో మౌనంగా ఉన్నామని, ఇప్పుడు మేము మీతోనే నడుస్తామని సొసైటీ ప్రాధమిక సభ్యులు పలువురు వెల్లడించారు.
మోసపూరితంగా మా వద్ద ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 లక్షలు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు వసూలు చేశారని ఆరోపించారు. వాస్తవంగా తాము అనర్హులమని బహిరంగంగా సర్వసభ్య సమావేశంలో పలువురు అంగీకరించారు. అర్హులైన హౌసింగ్ సొసైటీ సభ్యులందరూ ఆదివారం టీఎన్జీవో యూనియన్ ఫంక్షన్హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఐసీడీసీఎస్, ఇరిగేషన్, వెటర్నరీ ఫోరమ్‌ల అధ్యక్షులు రవి, రాజేష్, టీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో తాము యూనియన్‌లో బాధ్యులమని, గుర్తించి ప్లాట్లు ఇచ్చారని, సినియార్టీ ఉన్న వారికి అన్యాయం చేశారని తెలిపారు. అప్జల్ హసన్ దారిలో తాము కూడా మా ప్లాట్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ గారి ఆదేశాల మేరకు టీఎన్జీవో యూనియన్ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే సొసైటీ కూడా ఉండాలని తెలిపారు. వారి ఆదేశాల మేరకు టీఎన్జీవో యూనిట్, ఫోరమ్ అధ్యక్షులందరూ వంద శాతం టీఎన్జీవో యూనియన్‌కు అండగా ఉండి, ఈసారి సొసైటీని హస్తగతం చేసుకోవాలని సూచించారు. గతంలో ఏదైతే టీఎన్జీవో యూనియన్ కానీ అనర్హులకు కేటాయించిన ప్లాట్లు కానీ, అన్నింటినీ తిరిగి టీఎన్జీవో ప్రాథమిక సభ్యులకు కేటాయిస్తామని తెలిపారు. టీఎన్జీవో యూనియన్ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో, వారికే సొసైటీ పగ్గాలు ఇవ్వాలని కోరారు. ఆదివారం ఏదులాపురం కాలనీలో ఏలూరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు లేకపోవడంతో బయటి వ్యక్తులను పిలిపించుకుని ఒక గంటలోనే సమావేశంను ముగించారని అప్జల్ హసన్ విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల కొరకు కేటాయించిన ప్లాట్లతో రియల్ వ్యాపారం నిర్వహిస్తున్న ఏలూరిని ఈఎన్నికలలో తరిమికొట్టాలని, ఒక్కొక్క ప్లాట్ కు రూ.3లక్షలు ఎన్ఓసి పేరుతో రూ.లక్ష గుడిపేరుతో మరో రూ.లక్ష వారి కోర్ట్ కేసుల పేరుతో ఉద్యోగుల సొంతింటి ఆశను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన ఏలూరి శ్రీనివాసరావుకు బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఆర్.విఎస్ సాగర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీర నారాయణ, స్టేట్ అర్గనైజింగ్ సెక్రెటరీ నందగిరి శ్రీను, ట్రెజర్ బాగం పవన్ కుమార్, టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్.నాగుల్ మీరా, కట్ట నవీన్, ఎండి.మజీద్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాసరావు, జిల్లా టౌన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీస్ బుద్దా రామకృష్ణ, ఆర్.ఎన్.ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాబాసు జ్యోతి, ఇ.స్వప్న, రఘునాధపాలెం ఫోరమ్ యూనిట్ ప్రెసిడెంట్,సాయి శిరణ్మయి,మల్లీశ్వరి, విజయ, ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.