Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల వ్యవస్థను పరిరక్షించే పార్టీ బీజేపీ
- ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలో కమ్యూనిస్టుల శక్తి చూపుతాం
- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- భద్రాచలం పై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం : మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదని, మతాల మధ్య చిచ్చు పెట్టడమే దాని లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కుల వ్యవస్థను పరిరక్షించాలనే పార్టీ బిజెపి అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టుల శక్తి చూపుతామన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వామపక్ష భావజాలం, నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ గడ్డమీద తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి బిజెపిలోకి వెళ్తే ఈ రాష్ట్రానికి ముప్పు అని తమ్మినేని కొందరికి సూచించారు. గతంలో ఈటెల రాజేందర్ కు సైతం ఇదే విషయం చెప్పినట్లు ప్రస్తావించారు. బీఆర్ఎస్ తో పొత్తు బిజెపి వ్యతిరేక పోరాటానికే తప్ప ప్రజా సమస్యలపై యధాతధంగా ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కొత్త పేరుతో బీఆర్ఎస్ ఏమి చేసినా సమర్థించే ప్రసక్తే ఉండదన్నారు. పోడు సర్వేలో లోపాలు ఉన్నాయని తెలిపారు. చర్ల మండలం సుబ్బంపేటలో అసలు సర్వేనే నిర్వహించలేదన్నారు. 2006 పార్లమెంటు చట్టం ప్రకారం గిరిజనేతరులకు కూడా పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఉద్యమ బాట పడతామన్నారు. గుత్తి కోయిలైనా 36 ఏళ్ళు అయినా సరే సర్వే చేయాల్సిందేనని సూచిం చారు. మునుగోడులో బిజెపి ఓటమికి ఎర్రజెండాల కారణమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట కూడా సీపీఐ(ఎం), సీపీఐలు పోటీ పడమన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టుల శక్తి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. స్త్రీల గురించి కూడా బిజెపి వికృత ఆలోచనలు చేస్తోందని ఆలోచనలు చేస్తోందని చెప్పారు. రాజ్యాంగం ఓ చెత్త అంటూ దాని స్థానంలో చాతుర్వరణ వ్యవస్థతో కూడిన మనుధర్మాన్ని ఆచరణలోకి తెచ్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. గాంధీని చంపిన గాడ్సే బొమ్మను సైతం పార్లమెంటులో పెట్టాలని ప్రయత్నిస్తోందని తెలిపారు.
అడుగడుగునా స్వాగతం
అంతకు ముందు దుమ్ముగూడెం నుంచి బయలుదేరిన జన చైతన్య యాత్రకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక వద్ద పార్టీ మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళలు యాత్రను స్వాగతించారు. భద్రాచలం నుంచి విడగొట్టిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపేలా కషి చేయాలని తమ్మినేనికి వినతి పత్రం సమర్పించారు. పాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను చర్ల మండలం మొగిల్లపల్లిలో యాత్ర బృందం పరిశీలించింది. అలాగే భద్రాచలం ప్రారంభంలో గిరిజన మహిళలు యాత్రను స్వాగతించారు. పట్నంలో అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు.
భద్రాచలం పై తీవ్ర నిర్లక్ష్యం : మాజీ ఎంపీ మిడియం
భద్రాచలంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ మీడియం బాబురావు ధ్వజమెత్తారు. దీని వెనుక పైకి కనిపించని కక్ష సాధింపు ఉందన్నారు. సుదీర్ఘకాలం సీపీఐ(ఎం) గెలవడం కూడా ఓ కారణమన్నారు. పైకి కనిపించని ఆందోళనలు ఇక్కడి ప్రజల్లో ఉన్నాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాద్రికి ముప్పు పొంచి ఉందన్నారు. గతంలో వరదలు వచ్చినా 24 గంటల్లో నీళ్లు పోయాయని ఇప్పుడు శాంతినగర్ వరకు నీరు వచ్చిందంటే దానికి కారణం పోలవరం అన్నారు. రామాలయం ఇక్కడ ఉంటే ఆస్తులు ఆంధ్రాలో ఉన్నాయని తెలిపారు. బిజెపి తలుచుకుంటే ఒక్క ఆర్డినెన్స్ ద్వారా ముంపు, పోడు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించవచ్చన్నారు.
కేంద్రం కుట్ర ఫలితంగా పోటుదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల రాష్ట్రపతి వచ్చిన సందర్భంలో గిరిజనుల సమస్యలపై ప్రస్తావిస్తుందని ఆశించామని కనీసం ఐదో షెడ్యూల్ ద్వారా పథకాల గురించి కూడా ప్రస్తావించకపోవడం దారుణం అన్నారు. ఎస్టీల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని సాగనంపాలన్నారు.
పార్టీ పట్టణ కార్యదర్శి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, కె. బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.