Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రకు అపూర్వ స్పందన
- భారీ మోటర్ ర్యాలీతో అలరించిన పార్టీ శ్రేణులు
నవతెలంగాణ-భద్రాచలం
బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజలను జాగృతం చేసే ఉద్దేశంతో సీపీ(ఐ)ఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం సాయంత్రం భద్రాచలం పట్టణంలోకి చేరుకుంది. భద్రాచలం పట్టణ శివారు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి భారీ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఎర్రజెండాలు చేత బూని, ఎర్రని చొక్కాలను ధరించిన సీపీఐ(ఎం) శ్రేణులు ఈ సందర్భంగా భారీ మోటర్ ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, యూబీ సెంటర్, పాత మార్కెట్ రోడ్, మసీదు రోడ్, సినిమా హాల్ రోడ్డు మీదుగా ఈ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ సెంటర్లో భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలు దివంగత కుంజా బుజ్జి, సున్నం రాజయ్య విగ్రహాలకు, అల్లూరి సీతారామరాజు, మల్లు దొర గంటం దొర విగ్రహాలకు పార్టీ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) భద్రాచలం మండల కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగట్టారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వం అదాని పట్ల చూపిస్తున్న ప్రేమ ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు. అదానికి లక్షల రూపాయలు కట్టబెట్టిన మోడీ ప్రభుత్వం మరి అతడిని అరెస్టు చేయకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో వెల్లడించాలని కోరారు. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న లౌకిక, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారం చేపట్టాక ముస్లింలు, క్రైస్తవులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇది రాజరిక ప్రభుత్వమా..? ప్రజాస్వామ్యం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఫాసిస్టు విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి దేశభక్తి అసలే లేదని, గాంధీ మహాత్ముని చంపిన గాడ్సే విగ్రహం పార్లమెంట్లో పెడతానంటూ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మను ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో అమలు పరచాలని చూస్తోందని విమర్శించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతగా ముందుకు సాగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీన ఉభయ కమ్యూనిస్టుల పార్టీ సమావేశాలు జరుగుతాయని, వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్లు సర్దుబాటు ఈ సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుందని తెలిపారు. కమ్యూనిస్టుల శక్తి ఏమిటో రానున్న ఎన్నికల్లో చూపిస్తామని వెల్లడించారు. ఈ బహిరంగ సభలో సీపీఐ(ఎం) మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, డివిజన్ కో కన్వీనర్ కారం పుల్లయ్య, భద్రాచలం మండల కార్యదర్శి అకోజు సునీల్ కుమార్ తదితరులు ప్రసంగించారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డివిజన్ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కిరిపాటి పుల్లయ్య, ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, సున్నం గంగా, ఎటపాక మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, భద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, ఎర్రం శెట్టి వెంకట రామారావు, ఎన్.లీలావతి, సంతోష్ కుమార్, కుసుమ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.