Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
- వలసవాదులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి
- సామాజిక న్యాయం కోసం పోరాడాలి
- తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
- విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-చర్ల
బీజేపీ మతోన్మాద విధానాలకు స్వస్తి చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కట్టుకునే బట్టపైన, తినే తిండిపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అజమాయిషి చేస్తూ ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులకు ముస్లిమ్స్ కి మధ్య తగవులు పెడుతూ పరిపాలించే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన అన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో సైతం నిత్యావసర వస్తువులకు ధరలు పెంచడంతో నిరుపేదలు నానా అవస్తలు పడుతూంటే నరేంద్ర మోడీ మాత్రం మేకెన్ ఇండియా, అచ్చా దిన్ అంటూ సంకలు ఎగరేసుకుంటున్నాడని ఆయన విమర్శించారు. నల్లధనం వెనక్కి తీస్తాను వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ఇప్పుడు గ్యాస్ బండ, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికి అంతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికార అహంతో ప్రజలలో గందరగోళాలను సృష్టించి సుభిక్షంగా ఉన్న భారతదేశాన్ని అప్పులపాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని, లేకపోతే తగు సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులు చెట్టూ పుట్ట బాగు చేసుకొని దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటుంటే అడవుల సంరక్షణ నియమావళితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోడు పట్టాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు. వలసవాదులకు పోడు పట్టాలి ఇచ్చేది లేదని ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని భారత దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. వలసవాదులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వలసవాదుల అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తున్న ప్రభుత్వాలకు వలసవాదులను ఓటు అడిగే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
వలసవాదుల ఓట్లు కావాలి కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు సత్కారం చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వాలు తమ వైఖరిని వలసవాదుల పట్ల మార్చుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆయన నొక్కి చెప్పారు. అలా చేయకపోతే ముందు సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలకు వెనకాడదని తెలిపారు. అనంతరం వివిధ సంఘాలు, వివిధ పార్టీలు నాయకులతో మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పలువురు అడిగిన ప్రశ్నలకు తమ్మినేని సావధానంగా సమాధానాలు చెప్పారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షలు సోయం రాజారావు, సర్పంచ్ కాపల కృష్ణార్జున రావు, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొని తమ్మినేని వీరభద్రంతో ముచ్చటించారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు కే.బ్రహ్మచారి, చీమలమర్రి మురళీకృష్ణ, కె. పుల్లయ్య, కారం నరేష్, మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, పొడుగు గంటి సమ్మక్క, బందెల చంటి తదితరులు ఉన్నారు.