Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
గత నాలుగు రోజులుగా కురుస్తున్న తుఫాను వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తుఫానుతో పంటలన్నీ నేలమట్టం అయి, తడిసి ముద్దయి చేతికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా రైతుల పరిస్థితి నెలకొందని అన్నారు. అంతేకాకుండా అశ్వారావుపేట నియోజకవర్గంలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలలో జీడిమామిడి, మొక్కజొన్న, పొగాకు మరికొన్ని ఇతర పంటలు వర్షాలతో నేలమట్టం అయ్యాయని, పాడై పోయినపంటకి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపించి పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల నష్టపరిహారం చెల్లించే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50వేలు, పత్తికి ఎకరానికి రూ.లక్ష, మామిడి తోటకు ఎకరాకు రూ.లక్ష, మిరపకు ఎకరానికి రూ.పదిలక్షల అలాగే కూరగాయల పంటలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, బి.చిరంజీవి, ఎం.గంగరాజు, భద్రం, తగరం జగన్నాథం, తగరం నిర్మల సి.హెచ్ సీతారామయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.