Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఈ నెల 30న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం అదేవిధంగా 31న జరగనున్న పుష్కర పట్టాభిషేక మహౌత్సవాలకి భద్రాద్రి రామాలయ పరిసర ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం ఈ సంవత్సరం జరుగుతుండగా ఈ మహా ఉత్సవానికి ఆలయ అర్చకులు వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామాలయ వెలుపల ప్రత్యేకంగా పుష్కర పట్టాభిషేక నిమిత్తం ఏర్పాటుచేసిన యాగశాలలో ఆలయ అర్చకులు గురువారం పుష్కర పట్టాభిషేక మహౌత్సవానికి అంకురార్పణం చేశారు.
12 కుండలతో శ్రీరామాయణ మహా కృతువుని ఆలయ అర్చకులు వైభవంగా ప్రారంభించారు. ముందుగా పట్టాభిషేక యాగశాలలో అగ్ని మధనం చేసి అగ్నిని పుట్టించి రుత్వికులు మహా రుతువుని ప్రారంభించారు. తదుపరి ధ్వజరోహణ కార్యక్రమం నిర్వహించి 12 కుండలతో మహా హౌమాన్ని ప్రారంభించారు. సాయంత్రం లక్ష్మీ సమేత సీతారామచంద్ర స్వామి వారిని తిరువీధి సేవను ఆలయ అర్చకులు నిర్వహించక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక విద్యుత్ కాంతులతో రామాలయాన్ని అలంకరించారు .రామాలయం చుట్టూ చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. మిధున స్టేడియం వద్ద చలవ పందిళ్లుతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారు. భద్రాచలంలోని ఫంక్షన్ హాల్లను కాటేజీలను లాడ్జీలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టి ఆయా యజమానులకు పోలీస్ అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. శ్రీరామనవమి పట్టాభిషేకానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పోలీసులకి అధికారులకి వసతులు ఏర్పాటు చేసేందుకు ఫంక్షన్ హాల్ కాటేజ్ల నిర్వాహకులు సహకరించాలని పట్టణ ఎస్సై మధు ప్రసాద్ కోరారు.